ఆర్టీసీ సమ్మెకు బీఆర్ఎస్ మద్దతు… హామీలు అమలు చేయాలంటూ ప్రభుత్వంపై డిమాండ్

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, గతంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ క్యాబినెట్ ఆమోదం ఇచ్చి, జీవో మరియు గెజిట్ విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అదే నిర్ణయాన్ని అమలు చేయాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కార్మికులు అడుగుతున్నారని తెలిపారు. రెండున్నర సంవత్సరాలు గడిచినా హామీలు నెరవేర్చలేదని ప్రశ్నించారు.

ప్రస్తుతం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం నేపథ్యంలో ఆర్టీసీపై భారీ ఆర్థిక భారం పడుతున్నదని, అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేయడం లేదని ఆరోపించారు. దీంతో ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగులకు డీఏలు, రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇవ్వలేకపోతున్నదని పేర్కొన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆర్టీసీకి రూ.1500 కోట్ల గ్రాంట్ ఇచ్చిందని, ప్రస్తుతం ఆ గ్రాంట్‌ను నిలిపివేసినట్లు విమర్శించారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించినప్పటికీ, వాస్తవంగా విడుదల చేయడం లేదని ఆరోపించారు.

ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలిచి వారి న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమ్మెను పొడగించకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *