తెలంగాణలో ప్రస్తుతం శాంతిభద్రతల పరిస్థితిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఒకప్పుడు దేశంలోనే అత్యుత్తమ పోలీసింగ్ వ్యవస్థగా గుర్తింపు పొందిన తెలంగాణ పోలీస్ శాఖ ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న నేర ఘటనలు, మహిళల భద్రతపై వస్తున్న ప్రశ్నలు, రాజకీయ వేదింపుల ఆరోపణలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై ఆందోళన పెంచుతున్నాయి.
విమర్శకులు మాట్లాడుతూ.. “తెలంగాణ సాధించుకున్నది కేవలం భౌగోళిక రాష్ట్రం కోసం కాదు.. ప్రశాంతమైన సమాజం, పెట్టుబడులు, యువతకు ఉపాధి కోసం” అని గుర్తు చేస్తున్నారు. అలాంటి రాష్ట్రంలో ఇప్పుడు శాంతిభద్రతల అంశం పక్కకు వెళ్లిపోవడం బాధాకరమని అంటున్నారు.
ప్రభుత్వాలు మారినా ప్రాధాన్యతలు మారినా, ప్రజల భద్రత మాత్రం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యతగా ఉండాలని చెబుతున్నారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిపక్షాలపై నిఘా, రాజకీయ కేసులు, ట్రాకింగ్ వంటి అంశాలపైనే ఎక్కువ దృష్టి పెడుతోందని విమర్శిస్తున్నారు.
ఇక రాష్ట్రంలో హోం శాఖ వ్యవహారాలపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి స్వయంగా హోం శాఖ బాధ్యతలు చూసుకుంటున్నప్పటికీ, పోలీసింగ్‌పై సమగ్ర సమీక్షలు జరగడం లేదని అంటున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్షలు జరిగినా అవి శాంతిభద్రతల కంటే రాజకీయ అంశాలకే పరిమితమవుతున్నాయని ఆరోపిస్తున్నారు.
గతంలో తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుందని, హైదరాబాద్‌ను సురక్షిత నగరంగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిందని గుర్తుచేస్తున్నారు. కానీ ఇప్పుడు వరుస ఘటనలు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులోనే ఉన్నాయని చెబుతోంది. నేరాల నియంత్రణకు ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నామని, కమాండ్ కంట్రోల్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని అధికారులు వెల్లడిస్తున్నారు.
అయితే ప్రతిపక్షాలు మాత్రం “పోలీసింగ్ రాజకీయాల కోసం కాదు.. ప్రజల భద్రత కోసం ఉండాలి” అని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.

