వరి కొనుగోళ్లలో తెలంగాణ నంబర్-1.. రైతుల చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం హామీ

తెలంగాణలో వరి కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తోందని, రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తూ, దేశంలోనే వరి ఉత్పత్తి మరియు వరి కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం నంబర్-1 స్థానంలో ఉందని పేర్కొంది.

ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి, కొనుగోళ్లు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (MSP), నాణ్యత ప్రమాణాలు (FAQ) పూర్తిగా పాటిస్తూ కొనుగోళ్లు నిర్వహిస్తున్నామని తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం కొనుగోలు చేసిన పరిమాణానికి అదనంగా రూ.16,479 కోట్ల భారం భరించి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసినట్లు పేర్కొంది.

యాసంగి సీజన్‌లో సుమారు 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి అంచనా వేయగా, అందులో 75 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటికే 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించింది.

రాష్ట్రవ్యాప్తంగా 8,575 వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, అవసరమైన మౌలిక వసతులు, గన్నీ బ్యాగులు, రవాణా వాహనాలు, సిబ్బందిని సమకూర్చినట్లు తెలిపింది. ప్రస్తుతం 13 వేలకుపైగా వాహనాలు, 2 లక్షలకుపైగా సిబ్బంది, 2,008 రైస్ మిల్లులు కొనుగోలు ప్రక్రియలో పాల్గొంటున్నాయని వివరించింది.

రైతులకు చెల్లింపులు 48 నుంచి 72 గంటల్లోనే నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. యాసంగి సీజన్‌లోనే ఇప్పటివరకు రూ.1,150 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపింది. గత ప్రభుత్వ హయాంలో చెల్లింపులు నెలల తరబడి ఆలస్యం అయ్యేవని, ప్రస్తుతం వేగంగా చెల్లింపులు జరుగుతున్నాయని పేర్కొంది.

వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామని, ఇప్పటివరకు 10,214 మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించినట్లు తెలిపింది. అవసరమైతే ఇసుక లారీలు, పరిశ్రమల వాహనాలను కూడా ధాన్యం రవాణాకు వినియోగిస్తున్నట్లు వెల్లడించింది.

దేశవ్యాప్తంగా రబీ సీజన్‌లో కొనుగోలు అవుతున్న ధాన్యంలో అత్యధిక భాగం తెలంగాణ నుంచే వస్తోందని ప్రభుత్వం పేర్కొంది. రైతుల సంక్షేమమే లక్ష్యంగా కొనుగోలు ప్రక్రియను కొనసాగిస్తామని, రైతు పక్షపాత ప్రభుత్వంగా తమ కట్టుబాట్లు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *