తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగ నియామకాల ఆలస్యం, వయోపరిమితి తగ్గింపుపై నిరుద్యోగ జేఏసీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అశోక్ సార్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పలువురు నిరుద్యోగ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఏజ్ రిలాక్సేషన్‌ను 34 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు, ఉద్యమానికి మద్దతు తెలిపిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
వక్తలు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం “నీళ్లు, నిధులు, నియామకాలు” అనే ప్రధాన లక్ష్యాలతో సాగిందని గుర్తుచేశారు. తెలంగాణ కోసం వేలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు పోరాడి ప్రాణత్యాగాలు చేశారని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడితే ఇంటికో ఉద్యోగం వస్తుందని నమ్మి ఉద్యమంలో పాల్గొన్నామని, కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా నిరుద్యోగులకు సరైన న్యాయం జరగలేదని విమర్శించారు.
ప్రత్యేకంగా 2012 తర్వాత ఐటిడిఏ పరిధిలో ఒక్కటీచర్ నోటిఫికేషన్ కూడా రాలేదని, బీఈడ్, డీఈడ్ పూర్తి చేసిన వేలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వివాహం అయిన మహిళలు, కుటుంబ బాధ్యతల మధ్య చదువు పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని, ఇప్పుడు 35–40 ఏళ్ల వయస్సులో ఉన్న వారికి ప్రభుత్వం అవకాశాలు లేకుండా చేస్తోందని ఆరోపించారు.
గతంలో ప్రభుత్వం 46 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చిందని, ఇప్పుడు దాన్ని 34 ఏళ్లకు తగ్గించడం వెనుక ప్రభుత్వ ఉద్దేశ్యం ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. కొత్త నోటిఫికేషన్లు సమయానికి ఇవ్వకుండా నిరుద్యోగులను నిరాశలోకి నెట్టేసి, తర్వాత వయోపరిమితి తగ్గించడం అన్యాయమని అన్నారు. తెలంగాణలోనే అత్యల్ప వయోపరిమితి అమలు చేస్తున్నారని, ఇతర రాష్ట్రాల్లో కనీసం 40 ఏళ్ల వరకు అవకాశం ఉంటోందని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో లక్షల ఉద్యోగాలు, మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి వంటి హామీలు ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో విడుదలైన నోటిఫికేషన్లను తమ విజయాలుగా చెప్పుకుంటున్నారని ఆరోపించారు.
పోల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వంటి నియామకాలలో భారీ పరీక్ష ఫీజులు వసూలు చేస్తున్నారని, “ఫీజులు తగ్గిస్తాం” అని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు వెయ్యి రూపాయల వరకు ఫీజులు తీసుకుంటోందని మండిపడ్డారు. ఎస్సై, కానిస్టేబుల్ నియామకాల్లో గతంలో ఇచ్చినట్లే వయోపరిమితి సడలింపులు ఇవ్వాలని, లాంగ్ జంప్ అర్హతలను కూడా తగ్గించాలని డిమాండ్ చేశారు.
నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే భారీ ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అవసరమైతే సీఎం నివాసం, సచివాలయం ముట్టడికి కూడా వెనుకాడమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగులు అందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే భారీ ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అవసరమైతే సీఎం నివాసం, సచివాలయం ముట్టడికి కూడా వెనుకాడమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగులు అందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
చివరగా ప్రభుత్వం వెంటనే 46 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ అమలు చేయాలని, వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని, ఎన్నికల హామీలను అమలు చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

