మిర్యాలగూడ పట్టణం, నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందని సహకార శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మిర్యాలగూడలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ఇది ఆసియాలోనే అతిపెద్ద రైస్ ఇండస్ట్రీ ప్రాంతమని, వ్యాపార వర్గాలు, రైతులు కష్టపడి జీవించే ప్రాంతమని అన్నారు. ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని భారీ నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మిర్యాలగూడకు 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, మహిళా స్వయం సహాయక సంఘాలకు 12 కోట్ల రూపాయల వడ్డీ సబ్సిడీ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలులో ఉన్నాయని గుర్తు చేశారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి ప్రతి మహిళ కోటీశ్వరురాలిగా ఎదగాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.
గత పదేళ్ల పాలనతో పోలిస్తే గత 26 నెలల కాంగ్రెస్ పాలన ప్రజల పక్షాన నిలిచిందని ఉత్తం కుమార్ రెడ్డి పేర్కొన్నారు. పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పేదలకు సన్న బియ్యం అందించే స్థాయికి వ్యవస్థను తీసుకొచ్చిందని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల రాజ్యం, పేదలకే న్యాయం చేసే ప్రభుత్వమని స్పష్టం చేశారు.
రైతుల కోసం రూ.20 వేల కోట్ల రుణ సహాయం, విద్యాభివృద్ధి కోసం రూ.20 వేల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం జరుగుతోందని తెలిపారు. విద్య ద్వారానే పేదవాడు అభివృద్ధి చెందగలడనే నమ్మకంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
ఈ మున్సిపల్ ఎన్నికలు వ్యక్తుల పదవుల కోసం కాదని, పేద ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే వారి వెనుక ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి నిలబడి ఉంటారని ప్రజలకు భరోసా ఇచ్చారు. మిర్యాలగూడను పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత సోనియా గాంధీదేనని, ఆమెనే తెలంగాణ దేవతగా ప్రజలు గుర్తిస్తారని ఉత్తం కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన 1100 మంది అమరవీరులే నిజమైన జాతిపితలని పేర్కొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి 18 స్థానాలు గెలిపించి ముఖ్యమంత్రికి బలమైన మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన తొలి పర్యటనను నల్గొండ జిల్లాతో ప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, కాంగ్రెస్ పార్టీని చిరస్థాయిగా అధికారంలో నిలబెట్టి ప్రజా సమస్యలన్నీ కలిసి పరిష్కరించుకుందామని ఆయన పిలుపునిచ్చారు.

