తెలంగాణ రాజకీయాల్లో మరోసారి భూవివాదం హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వేం నరేందర్ రెడ్డి కుటుంబంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. అసైన్డ్ భూములను భూభారతి ద్వారా అక్రమంగా ఓనర్షిప్ మార్చుకుని, మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ పలు డాక్యుమెంట్లు బయటపెట్టారు.
బీఆర్ఎస్ నేతలు వెల్లడించిన వివరాల ప్రకారం, వేం నరేందర్ రెడ్డి కుమారుడు వేం కృష్ణ భార్గవ్ రెడ్డి పేరుమీద మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం అర్పణపల్లి పరిధిలో పలు అసైన్డ్ భూములు నమోదయ్యాయని తెలిపారు. సర్వే నంబర్లు 15/10, 7/10 సహా అనేక భూములు వేం కృష్ణ భార్గవ్ పేరుమీద భూభారతిలో నమోదయ్యాయని ఆరోపించారు.
ఇది సాధారణ భూమి కాదని, ప్రభుత్వ రికార్డుల ప్రకారం “అసైన్డ్ ల్యాండ్” మరియు “ప్రొహిబిటెడ్ ల్యాండ్” అని స్పష్టంగా నమోదైందని బీఆర్ఎస్ పేర్కొంది. ఈ భూములపై ఆర్డీవో, అడిషనల్ కలెక్టర్, కలెక్టర్ సంతకాలు ఉన్న పత్రాలను కూడా పార్టీ మీడియాకు విడుదల చేసింది.
బీఆర్ఎస్ నేతలు మరో కీలక అంశాన్ని ప్రస్తావించారు. వేం నరేందర్ రెడ్డి గతంలో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా, తరువాత ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లలో ఈ భూముల వివరాలు ఎక్కడా లేవని తెలిపారు. అయితే ఇటీవల రాజ్యసభ ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో మాత్రం సంబంధిత సర్వే నంబర్లకు అనుబంధంగా ఉన్న మైనింగ్ కార్యకలాపాల వివరాలు కనిపించాయని ఆరోపించారు.
“శ్రీ సాయి కృష్ణ గ్రానైట్స్” పేరుతో వేం నరేందర్ రెడ్డి భార్య వేం విజయలక్ష్మి పేరుమీద బ్లాక్ గ్రానైట్ మైనింగ్ జరుగుతోందని, మైన్స్ అండ్ జియాలజీ శాఖ పబ్లిక్ డొమైన్ డాక్యుమెంట్లలో ఇదంతా స్పష్టంగా ఉందని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. అదే సర్వే నంబర్లపై మైనింగ్ అనుమతులు తీసుకున్నారని వారు ఆరోపించారు.
ఇంకా తీవ్ర ఆరోపణలు చేస్తూ, మహబూబాబాద్ మాజీ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పాత్రపైనా బీఆర్ఎస్ ప్రశ్నలు లేవనెత్తింది. అసైన్డ్ భూములపై సంతకాలు చేసిన అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారో విచారణ జరపాలని డిమాండ్ చేసింది. మహబూబాబాద్ నుంచి బదిలీ అయిన అనంతరం ఆయన్ను ఢిల్లీలో తెలంగాణ భవన్ స్పెషల్ సెక్రటరీగా నియమించడం కూడా అనుమానాలకు తావిస్తోందని విమర్శించింది.
బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ, “ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన అసైన్డ్ భూముల మధ్యలో వేం కృష్ణ భార్గవ్ పేరు రావడం ఎలా సాధ్యమైంది? భూభారతి వ్యవస్థను అధికారంలో ఉన్నవారు తమకు అనుకూలంగా వాడుకుంటున్నారా?” అని ప్రశ్నించారు.
ఇక ఈ వ్యవహారంపై వెంటనే నిష్పక్షపాత విచారణ జరపాలని, వేం నరేందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని, సంబంధిత భూములను ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.
మరోవైపు, ఈ ఆరోపణలపై అధికార కాంగ్రెస్ పార్టీ లేదా వేం నరేందర్ రెడ్డి కుటుంబం నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు. రాజకీయంగా ఈ వ్యవహారం మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.

