హైదరాబాద్: కబడ్డీని అంతర్జాతీయ స్థాయిలో మరింత విస్తరించి, ఒలింపిక్స్‌లో భాగం చేయాలన్నదే తన జీవిత కల అని ఇంగ్లాండ్ కబడ్డీ ఫౌండర్, యూరప్ కబడ్డీ ఫెడరేషన్‌కు చెందిన అశోక్ దాస్ తెలిపారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ (IKF) సమావేశానికి హాజరైన ఆయన.. కబడ్డీ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
కబడ్డీ రంగంలో తాను సుమారు 40 ఏళ్లుగా పనిచేస్తున్నానని అశోక్ దాస్ తెలిపారు. IKF ఏర్పాటైన సమయంలో తాను వ్యవస్థాపక సభ్యుడిగా, అనంతరం వైస్ ప్రెసిడెంట్‌గా, ట్రెజరర్‌గా పనిచేశానని చెప్పారు. సుమారు 14 సంవత్సరాల పాటు IKFలో పనిచేసినట్లు వెల్లడించారు.
ఆసియా దాటి కబడ్డీని తీసుకెళ్లాం
ఆసియా వెలుపల కబడ్డీని అభివృద్ధి చేయడంలో తాను కీలకంగా పనిచేశానని అశోక్ దాస్ తెలిపారు. ఇంగ్లాండ్‌తో పాటు ఇటలీ, పోలాండ్ వంటి యూరప్ దేశాల్లో కబడ్డీని విస్తరించేందుకు కృషి చేసినట్లు చెప్పారు.
2004లో ఆసియా వెలుపల తొలి కబడ్డీ ఫెడరేషన్ ఇంగ్లాండ్‌లో ఏర్పడటం ఒక ముఖ్యమైన మైలురాయి అని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత ఇతర యూరప్ దేశాల్లోనూ కబడ్డీ విస్తరించిందన్నారు.
కసాని జ్ఞానేశ్వర్‌తో కలిసి ఒలింపిక్స్ లక్ష్యంగా
కబడ్డీని ఒలింపిక్స్‌కు తీసుకెళ్లాలన్నది తన చిరకాల కల అని అశోక్ దాస్ చెప్పారు. ఇదే లక్ష్యంతో కసాని జ్ఞానేశ్వర్‌ను కలిసి కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
కసాని జ్ఞానేశ్వర్ కూడా కబడ్డీని ఒలింపిక్స్‌లో చూడాలన్నదే తన విజన్‌గా చెప్పారని, అందుకే ఇద్దరూ కలిసి పనిచేస్తున్నామని వెల్లడించారు.
“కబడ్డీని ఒలింపిక్స్‌లో చూడటం నా జీవిత కల. నేను ఈ ప్రపంచం నుంచి వెళ్లిపోయే ముందు కబడ్డీ ఒలింపిక్స్‌లో ఆడటాన్ని చూడాలనుకుంటున్నాను” అని అశోక్ దాస్ భావోద్వేగంగా పేర్కొన్నారు.
42–43 దేశాల ప్రతినిధులతో చారిత్రాత్మక సమావేశం
హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రస్తుత IKF సమావేశానికి సుమారు 42 నుంచి 43 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారని అశోక్ దాస్ తెలిపారు. కొంతమంది ప్రతినిధులకు వీసా సమస్యలు ఉన్నప్పటికీ.. ఇంతమంది దేశాలు ఒకే వేదికపైకి రావడం కబడ్డీ చరిత్రలోనే కీలక ఘట్టమని అన్నారు.
మరిన్ని దేశాలు కబడ్డీ ఫెడరేషన్‌లో చేరి, మరిన్ని అఫిలియేషన్లు ఏర్పడితే.. ఒలింపిక్స్‌కు కబడ్డీ చేరే మార్గం మరింత సులభమవుతుందని అభిప్రాయపడ్డారు.
కామన్వెల్త్‌లో కబడ్డీకి అవకాశం
కామన్వెల్త్ గేమ్స్‌లో కబడ్డీకి చోటు కల్పించేందుకు గతంలో ఎన్నో ప్రయత్నాలు చేసినట్లు అశోక్ దాస్ తెలిపారు. 2022లో బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో కబడ్డీని చేర్చేందుకు ప్రయత్నించినా అది విజయవంతం కాలేదన్నారు.
అయితే భారత్ ఆతిథ్యమిచ్చే కామన్వెల్త్ గేమ్స్ ద్వారా కబడ్డీకి మంచి అవకాశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అదే విధంగా 2036లో భారత్‌లో ఒలింపిక్స్ జరిగితే.. ఆతిథ్య దేశంగా భారత్ కొన్ని క్రీడలను చేర్చుకునే అవకాశం ఉంటుందని, అందులో కబడ్డీకి కూడా అవకాశం లభిస్తుందనే నమ్మకం తనకు ఉందన్నారు.
భారత్‌కు మరిన్ని పతకాలు వస్తాయి
కబడ్డీ ఒలింపిక్స్‌లో చేరితే భారత్‌కు మరిన్ని పతకాలు సాధించే అవకాశం ఉంటుందని అశోక్ దాస్ అన్నారు.
భారత్ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఒకటైనప్పటికీ.. ఒలింపిక్స్ మెడల్ టేబుల్‌లో ఆశించిన స్థాయిలో పతకాలు సాధించకపోవడం తనను బాధించేదని తెలిపారు.
కబడ్డీ ఒలింపిక్స్‌లో చేరితే భారత క్రీడాకారులకు మంచి అవకాశం లభిస్తుందని, దేశానికి మరిన్ని పతకాలు రావడంతో పాటు యువతకు మరింత మంది భారతీయ క్రీడా ఆదర్శాలు ఏర్పడతారని అన్నారు.
కసాని చేస్తున్న కృషిపై ప్రశంసలు
కబడ్డీ అభివృద్ధి కోసం కసాని జ్ఞానేశ్వర్ తన సొంత సమయం, డబ్బును వెచ్చిస్తూ పనిచేస్తున్నారని అశోక్ దాస్ ప్రశంసించారు.
తాను కూడా గతంలో దాదాపు 30 ఏళ్ల పాటు సొంత సమయం, సొంత డబ్బుతో కబడ్డీని ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేశానని గుర్తుచేశారు.
ఇప్పుడు వివిధ దేశాల ప్రతినిధులు హైదరాబాద్‌కు రావడం.. గతంలో తాము వేసిన విత్తనాలు ఇప్పుడు మొలకెత్తుతున్నాయనే భావన కలిగిస్తోందన్నారు.
కబడ్డీని ప్రపంచ క్రీడగా తీర్చిదిద్దేందుకు అన్ని దేశాలు ఒకే వేదికపైకి రావడం గర్వకారణమని తెలిపారు. భారత్ వేదికగా జరుగుతున్న ఈ ప్రయత్నం కబడ్డీ భవిష్యత్తుకు కొత్త దిశ చూపిస్తుందని అశోక్ దాస్ ఆశాభావం వ్యక్తం చేశారు.
“ఇది కేవలం కబడ్డీకి సంబంధించిన సమావేశం కాదు.. ప్రపంచ వేదికపై కబడ్డీకి కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే చారిత్రాత్మక సందర్భం” అని ఆయన పేర్కొన్నారు.

