లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పై సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని భారతీయ జనతా పార్టీ ఎంపీ నిషికాంత్ దుబే డిమాండ్ చేశారు.
ఈ మేరకు లోక్‌సభలో తీర్మానం ప్రవేశపెట్టేందుకు నోటీసు ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. దేశాన్ని తప్పుదారి పట్టించే చర్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఈ డిమాండ్ చేసినట్లు చెప్పారు.
రాహుల్ గాంధీ విదేశీ శక్తుల ప్రభావంతో దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని దుబే ఆరోపించారు. ముఖ్యంగా జార్జ్ సోరోస్ వంటి వ్యక్తుల మద్దతుతో దేశాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
అమెరికాతో వాణిజ్య ఒప్పందాల విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజీ పడిందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల తర్వాతే ఈ రాజకీయ వివాదం మరింత తీవ్రం అయింది. అలాగే ఎం ఎం నరవాణే రచించిన ప్రచురించని పుస్తకం రాహుల్ గాంధీ చేతికి ఎలా చేరిందన్న అంశంపై కూడా దుబే ప్రశ్నలు లేవనెత్తారు.
ఇక ఎఫ్‌టీఐ ఫైల్స్‌లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేరు ఉందని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు కూడా రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపాయి. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే ఉద్దేశంతో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని దుబే విమర్శించారు.
ఈ వ్యాఖ్యలపై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపీ రేణుక చౌదరి దుబేపై మండిపడ్డారు. కేంద్ర మంత్రి పదవి కోసం రాజకీయ డ్రామా చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
ఇటీవల పార్లమెంట్‌లో ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతున్న నేపథ్యంలో ఈ తీర్మాన నోటీసు రాజకీయంగా మరింత చర్చకు దారి తీసింది. రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలా లేదా అన్నది ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కీలక అంశంగా మారింది.

