సైబర్ నేరాలకు కేంద్రంగా మారుతున్న మ్యూల్ ఖాతాలను అరికట్టేందుకు బ్యాంకింగ్ వ్యవస్థలో తక్షణ మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌కు లేఖ రాశారు.
ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చేపట్టిన “ఆపరేషన్ ఆక్టోపస్-2”లో బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న పలు లోపాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా అమాయకుల పేరిట తెరవబడుతున్న బ్యాంక్ ఖాతాల KYC వెరిఫికేషన్‌లో బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని లేఖలో పేర్కొన్నారు.
మ్యూల్ ఖాతాల ద్వారా భారీ స్థాయిలో అక్రమ లావాదేవీలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి ఘటనలో సుమారు రూ.180 కోట్ల లావాదేవీలు ఇలాంటి ఖాతాల ద్వారానే జరిగాయని వెల్లడించారు. ఈ కేసులో కొంతమంది బ్యాంక్ సిబ్బంది, ఏజెంట్లు కూడా ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు.
బ్యాంక్ ఖాతాలు తెరవడంలో ఆర్బిఐ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, KYC ప్రక్రియలో ఎలాంటి లోపాలు ఉండకూడదని సూచించారు. ఫీల్డ్ స్థాయిలో తరచూ ఆడిట్లు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. అనుమానాస్పద లావాదేవీలను తక్షణమే గుర్తించే సాంకేతికతను ప్రవేశపెట్టాలని కోరారు.
మ్యూల్ ఖాతాలను అరికట్టేందుకు ఆర్బిఐ, బ్యాంక్ అధికారులు, పోలీసులతో కలిసి జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని సూచించారు. సైబర్ నేరాలకు సహకరించిన బ్యాంక్ సిబ్బందిని బ్లాక్‌లిస్ట్ చేయాలని కూడా కోరారు.
ప్రజలు కమిషన్ ఆశతో తమ బ్యాంక్ ఖాతాలు, ATM కార్డులు, చెక్ బుక్స్ ఇతరులకు ఇవ్వొద్దని హెచ్చరించారు. అలాంటి చర్యలు చట్టపరంగా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయని స్పష్టం చేశారు. ఖాతా యజమానులకు సంబంధం లేకపోయినా, ఆ ఖాతాల ద్వారా జరిగే నేరాలకు మొదట బాధ్యత వారిపైనే పడుతుందని తెలిపారు.
సైబర్ నేరాల నివారణలో భాగంగా బ్యాంకింగ్ వ్యవస్థలో సమగ్ర మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని సీపీ సజ్జనార్ తన లేఖలో పేర్కొన్నారు.

