హైదరాబాద్‌లో కామన్ టికెట్ సిస్టమ్.. మెట్రో, ఎంఎంటీఎస్, బస్సులకు ఒకే టికెట్

హైదరాబాద్ నగర ప్రజా రవాణాలో భారీ మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇకపై ఎంఎంటీఎస్ రైళ్లు, మెట్రో రైలు, టీజీఎస్ఆర్టీసీ బస్సులకు ఒకే టికెట్ విధానం తీసుకురావడానికి ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తోంది. నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడం, ప్రజా రవాణా వినియోగాన్ని పెంచడం, ప్రయాణికులకు సులభతరం చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఎంఎంటీఎస్, మెట్రో, బస్సులు వేర్వేరుగా పనిచేస్తుండటంతో ప్రయాణికులు ఒక్కో సేవకు ఒక్కో టికెట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ మూడు రవాణా వ్యవస్థలను పరస్పరం అనుసంధానం చేస్తూ కామన్ టికెటింగ్ సిస్టమ్ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఒకే టికెట్ లేదా ఒకే యాప్ ద్వారా ప్రయాణికులు మెట్రో, ఎంఎంటీఎస్, బస్సు సేవలను వినియోగించుకునే అవకాశం కలగనుంది.

ప్రత్యేకంగా “లాస్ట్ మైల్ కనెక్టివిటీ”పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అంటే మెట్రో స్టేషన్ లేదా ఎంఎంటీఎస్ స్టేషన్ నుంచి ఇంటి వరకు లేదా గమ్యస్థానానికి చేరుకునే సౌకర్యాన్ని మెరుగుపరచాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఓలా, ఉబర్, రాపిడో వంటి ప్రైవేట్ రవాణా సేవలను కూడా ఈ వ్యవస్థతో అనుసంధానం చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందించనున్నారు. అందులో మెట్రో, ఎంఎంటీఎస్, బస్సుల రియల్ టైం డేటా అందుబాటులో ఉండనుంది. ఏ బస్సు ఎక్కడ ఉంది, మెట్రో టైమింగ్స్, ఎంఎంటీఎస్ రైళ్ల వివరాలు ఒకే యాప్‌లో కనిపించేలా సాఫ్ట్‌వేర్ రూపొందించనున్నారు. అలాగే కామన్ టికెట్ బుకింగ్ సౌకర్యం కూడా యాప్ ద్వారానే ఉండనుంది.

లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం ఎంఎంటీఎస్ స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు ప్రత్యేక ఫీడర్ సేవలను ప్రవేశపెట్టే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. షేరింగ్ ఆటోలు, షటిల్ వాహనాలు వంటి సేవలను జీపీఎస్ ఆధారంగా పర్యవేక్షించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఈ వ్యవస్థ అమలుకు అవసరమైన సాఫ్ట్‌వేర్, డిజిటల్ ప్లాట్‌ఫామ్, కన్సల్టెన్సీ సేవల కోసం త్వరలో టెండర్లు పిలవనున్నారు. ఇప్పటికే సంబంధిత శాఖల అధికారులు పలు సమావేశాలు నిర్వహించినట్లు సమాచారం. రెండు నెలల్లో ఈ కామన్ టికెటింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోంది.

మెట్రో రైల్ ప్రాజెక్ట్‌లో మొదటి నుంచి లాస్ట్ మైల్ కనెక్టివిటీకి ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించినప్పటికీ ఆశించిన స్థాయిలో అమలు కాలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం సమగ్ర రవాణా అనుసంధానంపై ఫోకస్ పెట్టడం నగర ప్రయాణికులకు ఊరటనిచ్చే అంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *