రైతుని రాజు చేస్తామన్నారు.. రోడ్డుపై కూర్చోబెట్టారు” – వరి కొనుగోళ్లపై రైతుల ఆవేదన

తెలంగాణలో వరి కొనుగోళ్ల వ్యవహారం మరోసారి రైతుల ఆగ్రహానికి కారణమైంది. కొనుగోలు కేంద్రాల్లో బస్తాల కొరత, కాంటాలు లేకపోవడం, ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావడం, వర్షాలకు వరి తడవడం వంటి సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. “రైతుని రాజు చేస్తామన్నారు.. కానీ రోడ్డుపై కూర్చోబెట్టారు” అంటూ ప్రభుత్వంపై రైతులు మండిపడుతున్నారు.

కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి వరి పోసి కాపలా కాస్తున్నామని రైతులు చెబుతున్నారు. “నెల ఏడో తారీఖు నుంచి ఇక్కడే ఉన్నాం. ఇప్పటికీ కొనేవాళ్లు లేరు. వాన పడితే వరి మొత్తం తడిచిపోతోంది. గాలికి పట్టాలు ఎగిరిపోతున్నాయి. ఈ పరిస్థితిలో రైతు ఎలా బతకాలి?” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

రైతుల మాటల్లో తీవ్ర నిరాశ కనిపిస్తోంది. “కేసీఆర్ ఉన్నప్పుడు లారీలు వచ్చి వరి వెంటనే తీసుకెళ్లేవి. ఇప్పుడు లారీలు లేవు, అధికారులు లేరు, కొనుగోలు చేసే వాళ్లు లేరు” అంటూ కొందరు రైతులు అసహనం వ్యక్తం చేశారు. వర్షం పడినా అధికారులు వచ్చి పరిస్థితి చూడలేదని ఆరోపించారు.

“బస్తాలు కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. మేమే కొనుక్కొచ్చాం. కాంటాలు కూడా మేమే చేసుకున్నాం. కానీ ఇప్పటికీ ధాన్యం కొనడం లేదు” అంటూ రైతులు వాపోయారు. ప్రభుత్వం రైతులను మార్కెట్ యార్డుల్లోనే వదిలేసిందని విమర్శించారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలపై కూడా రైతులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. “రైతు భరోసా, రెండు లక్షల రుణమాఫీ, తులం బంగారం, నెలకు 2500 అన్నారే కానీ ఏదీ అమలు కాలేదు” అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నమ్మి ఓటేశామని, ఇప్పుడు తీవ్రంగా మోసపోయామనే భావన రైతుల్లో కనిపిస్తోంది.

కొంతమంది రైతులు అయితే ఇక వ్యవసాయం చేయడం కష్టమైందని చెబుతున్నారు. “ఇలా ఉంటే వ్యవసాయం వదిలేసి ఊర్లకు వెళ్లిపోవాల్సిందే” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోళ్లు జరగకపోతే ధాన్యానికి నిప్పు పెట్టే పరిస్థితి వస్తోందని హెచ్చరించారు.

రైతుల ఆవేదనలో మరో ముఖ్య అంశం ఏమిటంటే.. ప్రభుత్వం “రైతుని రాజు చేస్తాం” అని చెప్పి ఇప్పుడు రైతులను మార్కెట్ యార్డుల్లోనే ఇబ్బందులకు గురి చేస్తోందనే విమర్శ. “ఇదేనా మార్పు?” అంటూ రైతులు నేరుగా ప్రశ్నిస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలోని పలు మార్కెట్ యార్డుల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వరి తడవడంతో నాణ్యత తగ్గిపోతుందనే భయం రైతుల్లో నెలకొంది. మరోవైపు కొనుగోళ్లలో జాప్యం కారణంగా రైతులు అప్పులు, వడ్డీల భారంతో ఆందోళన చెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *