తెలంగాణ కాంగ్రెస్‌పై ఏఐసీసీ ఫోకస్.. మంత్రివర్గంలో భారీ మార్పుల సంకేతాలు?

నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కేరళ, తమిళనాడు ప్రభుత్వాల ఏర్పాటు ప్రక్రియలో బిజీగా ఉన్న కాంగ్రెస్ అధిష్టానం.. ఆ ప్రక్రియ పూర్తయ్యాక పూర్తిస్థాయిలో తెలంగాణపై దృష్టి పెట్టబోతుందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

ముఖ్యంగా మంత్రివర్గ ప్రక్షాళన, శాఖల మార్పులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం, పార్టీ-ప్రభుత్వ సమన్వయం వంటి అంశాలపై ఏఐసీసీ సీరియస్‌గా ఫోకస్ పెట్టినట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలను త్వరలో ఢిల్లీకి పిలిచి చర్చలు జరిపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే పలు నివేదికలు అధిష్టానం వద్దకు చేరినట్లు తెలుస్తోంది. కొందరు మంత్రుల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని, మరికొందరిపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని కాంగ్రెస్ హైకమాండ్‌కు ఫిర్యాదులు వెళ్లినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీంతో కొంతమంది మంత్రుల శాఖలు మార్చడం, కొందరిని ఒక్క శాఖకే పరిమితం చేయడం, మరికొందరిని పూర్తిగా మంత్రివర్గం నుంచి తప్పించడం వంటి నిర్ణయాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం మరో జాగ్రత్త కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మంత్రివర్గం నుంచి తొలగించిన నేతలను పూర్తిగా పక్కన పెట్టకుండా, వారికి పార్టీ పదవులు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే నేరుగా మంత్రి పదవి తీసేస్తే ఆయా సామాజిక వర్గాల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉంటుంది. “అవినీతి కారణంగానే తొలగించారు” అనే ప్రచారం బలపడే ప్రమాదం కూడా ఉంది. అందుకే కొందరికి ఏఐసీసీ, పీసీసీ లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇచ్చే ఫార్ములా అమలు చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.

ఇక రెండున్నరేళ్లుగా రెండు శాఖలు నిర్వహిస్తున్న కొంతమంది మంత్రులపై కూడా అసంతృప్తి ఉందనే చర్చ జరుగుతోంది. “పూర్తిస్థాయిలో ఫలితాలు ఇవ్వలేకపోయారు”, “ఫీల్డ్‌లో కనిపించడం లేదు”, “ప్రభుత్వానికి నెగెటివ్ ఇమేజ్ వస్తోంది” అనే అభిప్రాయాలు కూడా పార్టీ లోపల వినిపిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ మార్పులపై మంత్రులకే ముందుగానే క్లారిటీ ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. “పదవి ఉంటే ఉంటుంది.. పోతే పోతుంది” అన్న మైండ్‌సెట్‌లో చాలామంది ఉన్నారని, ఇప్పటికే తమ తదుపరి రాజకీయ వ్యూహాలపై దృష్టి పెట్టినట్టు సమాచారం. కొందరు ఎమ్మెల్యేలు భవిష్యత్తులో పార్టీ పదవుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టగా, మరికొందరు వచ్చే ఎన్నికల లక్ష్యాలతో నియోజకవర్గాలపైనే ఫోకస్ పెంచినట్టు తెలుస్తోంది.

మరోవైపు తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత సమన్వయం కూడా పెద్ద చర్చగా మారింది. ప్రభుత్వం ఒక దారిలో, పార్టీ మరో దారిలో వెళ్తోందనే అభిప్రాయం కార్యకర్తల్లో ఉందని అధిష్టానం గుర్తించినట్టు తెలుస్తోంది. అందుకే ప్రభుత్వం-పార్టీ మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడానికి వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకాన్ని కూడా త్వరగా పూర్తి చేయాలని ఏఐసీసీ భావిస్తున్నట్టు సమాచారం.

ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో మిశ్రమ అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల హామీల అమలు, రైతు సమస్యలు, ఉద్యోగాల భర్తీ, భూముల అంశం, మంత్రులపై వస్తున్న ఆరోపణలు వంటి అంశాలు ప్రభుత్వానికి సవాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అధిష్టానం ఇప్పుడు “డ్యామేజ్ కంట్రోల్” మోడ్‌లోకి వెళ్లినట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

మరి నిజంగానే తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ మార్పులు జరుగుతాయా? ఎవరి శాఖలు మారతాయి? ఎవరు ఔట్ అవుతారు? ఎవరికీ పార్టీ పదవులు వస్తాయి? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వచ్చే ఒకటి రెండు వారాల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *