తెలంగాణ రాజకీయాల్లో మార్పుల సంకేతాలు.. బీజేపీ, కాంగ్రెస్‌పై పెరుగుతున్న అసంతృప్తి

తెలంగాణ రాజకీయాల్లో భారీ మార్పులకు సంకేతాలు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణ రాజకీయాలపై కూడా పడే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అంతర్గత పరిస్థితులు, ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.

రాజకీయ విశ్లేషకుడు లింగాల రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ బలపడే అవకాశాలను పార్టీ నాయకులే దెబ్బతీస్తున్నారని వ్యాఖ్యానించారు. “బీజేపీని నిలబెట్టే ప్రయత్నం చేయాల్సిన నాయకులు, పార్టీని మూడో స్థానానికే పరిమితం చేసేలా వ్యవహరిస్తున్నారు” అని అన్నారు.

ఈటల రాజేందర్ లాంటి డైనమిక్ నాయకుడికి పూర్తి స్థాయి బాధ్యతలు ఇస్తే పరిస్థితులు మారేవని, కానీ అంతర్గత కుమ్ములాటలతో బీజేపీ బలహీనపడుతోందని వ్యాఖ్యానించారు. “రాజాసింగ్ మాట్లాడితే అణిచివేస్తున్నారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ చుట్టూనే పార్టీ తిరుగుతోంది” అని విమర్శించారు.

తెలంగాణలో బీజేపీ రెండో స్థానానికి వచ్చిన సమయంలో పార్టీకి మంచి అవకాశమున్నప్పటికీ, నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల మళ్లీ వెనుకబడిందని పేర్కొన్నారు. “ఎవరు ఎదగాలి, ఎవరిని దిగదోడాలి అన్న రాజకీయాలే ఎక్కువయ్యాయి” అని వ్యాఖ్యానించారు.

ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని అన్నారు. “ప్రజాపాలన అని చెప్పినా హామీలు పూర్తిగా అమలు కావడం లేదు. పెన్షన్లు, రైతు భరోసా, ఉద్యోగాల విషయంలో ప్రజలు నిరాశ చెందుతున్నారు” అని వ్యాఖ్యానించారు.

ప్రత్యేకంగా ఉచిత బస్సు పథకం వల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారని, ఉద్యోగస్తులు కూడా అసౌకర్యాలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. “ప్రజలకు ఉపయోగపడే విధంగా వ్యవస్థలను అమలు చేయాలి కానీ ప్రచారానికి పరిమితం కాకూడదు” అని సూచించారు.

ప్రస్తుతం తెలంగాణలో ప్రజలు కొత్త రాజకీయ ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారని, ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి రాబోయే ఎన్నికల్లో కీలక ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *