హైదరాబాద్‌లో మహిళల భద్రతపై పెరుగుతున్న ఆందోళనల మధ్య మల్కాజిగిరి సీపీ సుమతి చేసిన అండర్‌కవర్ ఆపరేషన్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విధుల్లో చేరిన తొలి రోజే సీపీ సుమతి అర్ధరాత్రి సమయంలో సామాన్య మహిళలా మారి దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో స్వయంగా పరిస్థితులను పరిశీలించడం సంచలనంగా మారింది. ఈ ధైర్య సాహస చర్యతో ఆమెకు “లేడీ సింగం” అనే పేరు వచ్చింది.
మంగళవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3.30 గంటల వరకు సీపీ సుమతి ఎలాంటి పోలీస్ యూనిఫామ్ లేకుండా, సాధారణ మహిళగా దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టాండ్ ప్రాంతంలో తిరిగారు. ఒంటరిగా బస్ కోసం వేచి చూస్తున్న మహిళగా నటిస్తూ అక్కడి వాస్తవ పరిస్థితులను గమనించారు.
ఈ సమయంలో అనేక మంది యువకులు ఆమెను వెంబడిస్తూ వేధింపులకు పాల్పడినట్లు తెలిసింది. కొందరు అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, బైక్‌లపై వెంబడించడం, అనుచితంగా మాట్లాడడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా మద్యం, గంజాయి మత్తులో ఉన్న కొంతమంది యువకులు అత్యంత అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం.
సీపీ సుమతి గమనించిన మరో ముఖ్య అంశం ఏమిటంటే, అర్ధరాత్రి సమయంలో ఆ ప్రాంతంలో పోలీస్ పెట్రోలింగ్ కనిపించకపోవడం. దాదాపు మూడున్నర గంటల పాటు ఆమె అక్కడ ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా పోలీస్ వాహనం రాకపోవడాన్ని ఆమె తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది.
ఆపరేషన్ చివర్లో బీట్ కానిస్టేబుళ్లు అక్కడికి చేరుకున్నప్పుడు మాత్రమే సీపీ సుమతి అక్కడ ఉన్నారని గుర్తించారు. వెంటనే ఆమెకు సెల్యూట్ చేయడంతో అక్కడి యువకులు షాక్‌కు గురయ్యారు. అనంతరం సుమారు 40 మంది యువకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అయితే వారిపై కఠిన కేసులు నమోదు చేయకుండా, భవిష్యత్తు దృష్ట్యా కౌన్సిలింగ్ నిర్వహించాలని సీపీ సుమతి నిర్ణయించారు. వీరిలో ఎక్కువ మంది కాలేజీ విద్యార్థులు, హాస్టల్ యువకులే ఉండటంతో వారి జీవితాలు పాడవకుండా హెచ్చరికలతో విడిచిపెట్టినట్లు సమాచారం.
ఈ ఆపరేషన్ ద్వారా మహిళలు అర్ధరాత్రి సమయంలో ఎదుర్కొనే ఇబ్బందులు ప్రత్యక్షంగా బయటపడ్డాయి. ముఖ్యంగా నైట్ షిఫ్ట్ ఉద్యోగాలు చేసే మహిళలు, అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావాల్సిన మహిళలు ఎంతటి భయాందోళనల మధ్య జీవిస్తున్నారో ఈ ఘటన స్పష్టం చేసింది.
సీపీ సుమతి చర్యపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాల్లో మాత్రమే చూసే అండర్‌కవర్ ఆపరేషన్లు నిజ జీవితంలో చేసి చూపించారని, మహిళల భద్రతపై పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.
ఇకపై నగరంలో పెట్రోలింగ్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. మహిళలపై వేధింపులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు.

