తెలంగాణ రాజకీయాల్లో మరోసారి అరెస్టులు, కేసులు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు హాట్ టాపిక్‌గా మారాయి. బీఆర్ఎస్ నాయకుడు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కాంట్రాక్ట్ వ్యవహారంలో సీబీఐ విచారణ కోరినందుకే తనపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని ఆరోపించారు.
సీతక్కను ప్రశ్నిస్తూ అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కాంట్రాక్ట్‌పై సీబీఐ విచారణ జరపాలని అడిగానని, అదే కారణంగా తనను 16 రోజుల పాటు జైలులో పెట్టారని అన్నారు. “వారం రోజులుగా అదే ప్రశ్న అడుగుతున్నావా అంటూ నన్ను టార్గెట్ చేశారు” అని విమర్శించారు. ఈ కేసుల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే కంప్లైంట్ ఇచ్చిందని ఆరోపించారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, శ్రవణ్ దాసోజు, కార్తీక్ రెడ్డి తదితరులతో కలిసి రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యవహారాన్ని బయటపెట్టామని, కోట్వాల్ గూడా దగ్గర పెయింట్ తొలగించడంతో అసలు కంపెనీ పేరు బయటపడిందని పేర్కొన్నారు. “అది నేను చేసిన నేరమా?” అంటూ ప్రశ్నించారు.
తనపై “హ్యాబిచువల్ అఫెండర్” ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారని, వాస్తవాలను ప్రశ్నించినందుకే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కూకట్పల్లి కోర్టు జడ్జికి కృతజ్ఞతలు తెలుపుతూ, తనపై పెట్టిన 10 ఏళ్ల శిక్షకు సంబంధించిన సెక్షన్లను కోర్టు తొలగించిందని తెలిపారు.
పోలీసు కస్టడీలో తన ఫోన్ కాల్స్, మీడియా ప్రతినిధులతో ఉన్న కాంటాక్ట్స్ గురించి ప్రశ్నించారని చెప్పారు. “10 టీవీ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ గారి నెంబర్ ఎందుకు ఉంది? సాక్షి కోఆర్డినేటర్ నెంబర్ ఎందుకు ఉంది? ఆంధ్రజ్యోతి రిపోర్టర్ నెంబర్ ఎందుకు ఉంది?” అంటూ ప్రశ్నించారని పేర్కొన్నారు. మీడియా వ్యక్తులతో మాట్లాడటాన్నే అనుమానాస్పదంగా చూపుతున్నారని విమర్శించారు.
ఇదే సమయంలో రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్, ఫోన్ హ్యాకింగ్, వైఫై హ్యాకింగ్ జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. “నేను మాట్లాడిన ప్రతి కాల్, వెళ్లిన ప్రతి లొకేషన్ గురించి అడిగారు. దీంతో ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తోందనే అనుమానం మరింత బలపడింది” అన్నారు.
ఎస్ఎస్సీ పేపర్ లీక్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో చెట్ల నరికివేత వంటి అంశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకే తనపై కేసులు పెట్టారని తెలిపారు. “పత్రికల్లో వచ్చిన వార్తలు పోస్ట్ చేస్తే కేసులా?” అంటూ ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పా? రైతుల సమస్యలు, పేపర్ లీకులు, పర్యావరణ అంశాలు అడిగితే కేసులు పెడుతున్నారు” అని మండిపడ్డారు. తాము బీఆర్ఎస్ కార్యకర్తలమని, కేసులకు భయపడమని చెప్పారు. “మేము కేసీఆర్ శిష్యులం.. ఉద్యమం కొనసాగుతుంది” అంటూ వ్యాఖ్యానించారు.

