విజయ్‌కు 152 ఎమ్మెల్యేల బలం.. కూటముల రాజకీయాల్లో చిక్కుకున్న టీవీకే!

తమిళనాడులో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా టీవీకే పార్టీ అధినేత విజయ్ చుట్టూ ఇప్పుడు మొత్తం రాజకీయ సమీకరణాలు తిరుగుతున్నాయి. మొదట స్వతంత్రంగా రాజకీయాల్లో ఎదగాలని, సింగల్ గా అధికారంలోకి రావాలని భావించిన విజయ్ ఇప్పుడు పరిస్థితుల దృష్ట్యా అన్ని పార్టీల మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితిలోకి వెళ్లినట్టుగా రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రస్తుతం టీవీకే పార్టీ బలం 152 మంది ఎమ్మెల్యేల వరకు చేరినట్టుగా వార్తలు వస్తున్నాయి. డిఎంకేకు చెందిన సుమారు 30 మంది ఎమ్మెల్యేలు కూడా విజయ్‌కు మద్దతు ప్రకటించినట్టుగా ప్రచారం జరుగుతోంది. దీనితో తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు కనిపిస్తున్నాయి.

అన్నా డిఎంకే సీనియర్ నేతలు వెలుమణి, షణ్ముఖం నివాసంలో జరిగిన కీలక సమావేశం తర్వాత పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. సీఎం విజయ్ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఒక్క ఓటుతో గెలిచిన ఎమ్మెల్యే విశ్వాస పరీక్షలో పాల్గొనవద్దని హైకోర్టు చెప్పిన అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో జరగనున్న ఫ్లోర్ టెస్ట్ పై అందరి దృష్టి పడింది.

అయితే ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్న విషయం ఏమిటంటే.. విజయ్ మొదట ప్రజల మద్దతుతో ఒంటరిగానే ముందుకు వెళ్లాలని భావించాడు. కానీ రాజకీయ పరిస్థితులు అతడిని కూటముల రాజకీయాల్లోకి నెట్టినట్టుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ పెట్టిన షరతులు కూడా ఇప్పుడు చర్చకు దారి తీస్తున్నాయి. ఐదుగురు ఎమ్మెల్యేలు టీవీకేలో చేరేందుకు కాంగ్రెస్ పార్టీ అనుమతించినా, భవిష్యత్తులో ఎన్నికలు ఎక్కడ పోటీ చేసినా కూటమిలోనే ఉండాలని షరతు పెట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది. అంటే విజయ్‌కు ఇక పూర్తిస్థాయి స్వతంత్ర రాజకీయాలకు అవకాశం తగ్గిపోయినట్టే కనిపిస్తోంది.

ఇది కేవలం ఎమ్మెల్యేల మద్దతు విషయం మాత్రమే కాదు. భవిష్యత్తులో టీవీకే పార్టీ తీసుకునే నిర్ణయాలపై కూడా ఇతర పార్టీల ప్రభావం ఉండే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విజయ్ వ్యక్తిగతంగా మంచి ఆలోచనలు ఉన్న నాయకుడైనా, అతనితో కలుస్తున్న ఇతర పార్టీల సిద్ధాంతాలు కూడా టీవీకేపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రజలు ఇప్పటికే మూడో స్థానానికి పరిమితం చేసిన అన్నా డిఎంకే నేతలు ఇప్పుడు టీవీకేలో ప్రభావం చూపడం ఎంతవరకు పార్టీకి ఉపయోగపడుతుందో అన్న చర్చ కూడా మొదలైంది.

ఇక కాంగ్రెస్ పార్టీ పెట్టిన షరతులు చూస్తే.. స్థానిక సంస్థల ఎన్నికలు అయినా, అసెంబ్లీ ఎన్నికలు అయినా, పార్లమెంట్ ఎన్నికలు అయినా కూటమి రాజకీయాలు తప్పవనే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో విజయ్ భవిష్యత్తులో తన సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్లగలడా లేదా అన్న ప్రశ్న కూడా వస్తోంది. టీవీకే పార్టీ ఎదుగుదలను నియంత్రించాలనే ప్రయత్నం జరుగుతోందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటివరకు సినిమా స్టార్ ఇమేజ్ తో ప్రజల్లో భారీ క్రేజ్ సంపాదించిన విజయ్.. ఇప్పుడు నిజమైన రాజకీయ నాయకుడిగా ఎంతవరకు నిలబడతాడు అన్నది చూడాల్సి ఉంది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కానీ ఆ మార్పు పూర్తిగా స్వతంత్రంగా ఉండాలా లేదా పాత పార్టీల ప్రభావంలోనే కొనసాగాలా అన్నది కూడా ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ప్రస్తుతం ఎమ్మెల్యేల సంఖ్య పెరిగినా, అసలు పరీక్ష మాత్రం పాలనలోనే ఉంటుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇక ఒక సంవత్సరం తర్వాతే విజయ్ నాయకత్వంపై అసలు అంచనా వేయగలమని చాలా మంది విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏర్పడుతున్న కూటములు, మద్దతులు, ఒత్తిడులు మధ్య విజయ్ తన అసలు రాజకీయ దిశను ఎలా నిర్ణయిస్తాడు అనేదే తమిళనాడు రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే అంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *