భగీరత్ పోక్సో కేసులో కీలక మలుపు.. ఐదు ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు

నమస్తే.. వెల్కమ్ టు ఓకే టీవీ.

తెలంగాణ రాజకీయాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ ఇప్పుడు ఒకే కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు రోజురోజుకు కీలక మలుపులు తిరుగుతోంది. బుధవారం పోలీసుల విచారణకు హాజరుకావాల్సిన భగీరథ్ అనూహ్యంగా గైర్హాజరవ్వడం, తాను పంపిన ఈమెయిల్‌ను పోలీసులు తిరస్కరించడం, మరోవైపు ఐదు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసులో విచారణకు హాజరుకావాలని ఇప్పటికే భగీరథ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే నేరుగా హాజరుకాకుండా ఆయన పోలీసులకు ఈమెయిల్ పంపారు. తనపై వచ్చిన ఆరోపణలు తప్పని నిరూపించేందుకు అవసరమైన ఆధారాలు సేకరించాల్సి ఉందని, అందుకోసం రెండు రోజుల సమయం కావాలని కోరుతూ మే 15న విచారణకు హాజరవుతానని పేర్కొన్నారు.

అయితే ఈ వివరణను పోలీసులు ఏమాత్రం అంగీకరించలేదు. కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్న డీసీపీ రీతిరాజ్ మాట్లాడుతూ.. నిందితుడు సమయం కోరుతూ మెయిల్ పంపిన విషయం నిజమేనని, కానీ దర్యాప్తు ప్రక్రియను ప్రభావితం చేసే విధంగా ఆ మెయిల్‌ను సోషల్ మీడియాలో ప్రచారం చేయడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. ఇది మీడియా ట్రయల్‌కు దారితీస్తోందని పోలీసు వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

భగీరథ్ విచారణకు హాజరుకాకపోవడంతో పోలీసులు మరింత దూకుడు పెంచారు. ఏసీపీ శంకర్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. రెండు బృందాలు ఢిల్లీలో, రెండు బృందాలు హైదరాబాద్‌లో, మరో బృందం కరీంనగర్‌లో గాలింపు చర్యలు చేపడుతోంది. భగీరథ్ ఎక్కడ ఉన్నా గుర్తించి చట్టం ముందు నిలబెడతామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ కేసులో మరో సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి వయసుపై భగీరథ్ తరపు న్యాయవాదులు అనుమానాలు వ్యక్తం చేయగా, పోలీసుల దర్యాప్తులో రెండు వేర్వేరు బర్త్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డుల్లో రెండు వేర్వేరు పేర్లు ఉన్నట్లు బయటపడింది. దీంతో బాలిక అసలు వయసు ఎంత? ఈ డాక్యుమెంట్లలో తేడాలు ఎందుకు వచ్చాయి? అనే అంశాలపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. బాలిక జన్మించిన ఆసుపత్రి రికార్డులను కూడా సేకరిస్తున్నారు.

అంతేకాదు, నేరం జరిగిన ప్రాంతాల్లో గురువారం సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించేందుకు కూడా పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో ప్రతి అంశాన్ని శాస్త్రీయ ఆధారాలతో నిర్ధారించేందుకు దర్యాప్తు బృందం కసరత్తు చేస్తోంది.

మరోవైపు ఈ కేసు రాజకీయ రంగు కూడా పులుముకుంది. బీఆర్ఎస్ నేత కవిత స్పందిస్తూ.. భగీరథ్‌పై వెంటనే లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. నిందితుడు విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని ఆమె ఆరోపించారు. అలాగే ప్రధాని మోదీతో బండి సంజయ్ ఒకే వేదిక పంచుకోవడాన్ని కూడా ఆమె ప్రశ్నించారు.

పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. బాధితురాలికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, దోషులను కాపాడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మంత్రి సీతక్క కూడా స్పందిస్తూ.. కేంద్ర మంత్రి కుమారుడైనా చట్టం ముందు అందరూ సమానమేనని, తప్పు నిరూపితమైతే కఠిన శిక్ష తప్పదని అన్నారు.

ఇక మహిళా సంఘాలు కూడా ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బుధవారం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట భారీ నిరసనలు చేపట్టారు. పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం భగీరథ్ పరారీలో ఉన్నాడనే ప్రచారం జరుగుతుండగా, పోలీసులు మాత్రం అతన్ని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెబుతున్నారు. ఇదే సమయంలో హైకోర్టులో దాఖలైన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై గురువారం విచారణ జరగనుండటం ఆసక్తికరంగా మారింది. కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందా? లేక అరెస్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? అన్న ఉత్కంఠ నెలకొంది.

ఇదిలా ఉండగా హైదరాబాద్‌లోని పలు చౌరస్తాల్లో “భగీరథ్ పరారి” అంటూ వెలిసిన పోస్టర్లు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రాజకీయంగా, చట్టపరంగా ఈ కేసు ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో అన్న ఆసక్తి రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తోంది.

ఈ కేసుకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *