దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నీట్ యూజీ 2026 పరీక్ష రద్దుపై తెలంగాణ సీఎం Revanth Reddy తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే నీట్ యూజీ పరీక్షను రద్దు చేయాల్సి వచ్చిందని ఆయన విమర్శించారు. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నియంతృత్వ, నిరంకుశ నిర్ణయమని మండిపడ్డారు.
గత పదేళ్లలో ప్రధాని Narendra Modi హయాంలో దేశవ్యాప్తంగా 93 పేపర్ లీకేజీలు జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ పరిణామాలతో రెండు కోట్లకు పైగా విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. పేపర్ లీక్ ఘటనలు బయటపడినా సంబంధిత అధికారులపై లేదా మంత్రులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
నీట్ పరీక్ష రద్దు దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఇది పెద్ద నోట్ల రద్దు తరహాలోనే తీసుకున్న అనాలోచిత నిర్ణయమని రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కూడా తీవ్ర చర్చ జరుగుతోంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పరీక్షకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండాల్సి ఉండగా, ఒక జిరాక్స్ సెంటర్ నుంచే పేపర్ లీక్ కావడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పేపర్ లీక్ ఎలా జరిగింది? ఎవరి ద్వారా బయటకు వెళ్లింది? ఎంత మొత్తాలకు అమ్ముడైంది? అనే అంశాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మొదట పేపర్‌ను రూ.30 వేలకే విక్రయించారని, అక్కడి నుంచి మరింత పెద్ద స్థాయిలో డబ్బులు మారాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిన వ్యవస్థలే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇలాంటి ఘటనలు మరింత పెరిగే ప్రమాదం ఉందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. పరీక్షా విధానంలో పారదర్శకత, భద్రత, బాధ్యత పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

