హైదరాబాద్లో కార్పొరేటర్ ఎన్నికల టికెట్ ఇప్పిస్తామని చెప్పి తన వద్ద నుంచి రూ.1.5 లక్షలు తీసుకుని మోసం చేశారని గీత అనే మహిళ ఆరోపించారు. ఈ వ్యవహారంలో భూసపు శంకర్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకుని తన డబ్బులు తిరిగి ఇప్పించాలని ఆమె డిమాండ్ చేశారు.
గీత మాట్లాడుతూ, తాను డివిజన్ కార్పొరేటర్ ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రయత్నించానని తెలిపారు. ఈ క్రమంలో భూసపు శంకర్ అనే వ్యక్తిని కలిశానని, ఆయనను బీజేపీ నాయకుడిగా తనకు పరిచయం చేశారని చెప్పారు. టికెట్ కోసం ఖర్చులు అవుతాయని చెప్పి తన వద్ద నుంచి దాదాపు రూ.1,50,000 వరకు తీసుకున్నారని ఆరోపించారు.
అయితే చివరికి తనకు ఎలాంటి టికెట్ రాలేదని, డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని గీత వాపోయారు. పలుమార్లు అడిగినా “ఇస్తా, ఇస్తా” అంటూ కాలయాపన చేశారని చెప్పారు.
ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ సరైన స్పందన రాలేదని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా తనపై ఆరోపణలు చేస్తున్నావంటూ భూసపు శంకర్, ఆయన తమ్ముడు బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు.
“నా పేరు చెడగొడుతున్నావంటూ ఒక కోటి రూపాయల ఇజార్ దావా వేస్తామని బెదిరిస్తున్నారు. పోలీసుల ముందే నన్ను భయపెట్టేలా మాట్లాడుతున్నారు” అని గీత పేర్కొన్నారు.
తనకు నోటీసులు పంపించామని చెబుతున్నారని, కానీ ఇప్పటివరకు ఎలాంటి నోటీసు అందలేదని ఆమె అన్నారు. ఈ విషయంపై బీజేపీ కార్యాలయానికి కూడా వెళ్లి ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన కనిపించలేదని తెలిపారు.
చివరగా, “నా డబ్బులు నాకు తిరిగి ఇప్పించాలి. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ చేసి న్యాయం చేయాలి” అని గీత ప్రభుత్వాన్ని, పోలీసులను కోరారు.

