కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar పేరును మీడియాలో, సోషల్ మీడియాలో వాడొద్దంటూ సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని కొంతమంది లాయర్లు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీశాయి. అసలు కోర్టు అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, కేవలం పిటిషన్ మాత్రమే దాఖలైందని, ఇంకా అది నెంబర్ కూడా కాలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విషయం ఇంకా జడ్జి ముందుకు విచారణకే రాకముందే, కోర్టు ఆదేశాలు ఇచ్చిందని మీడియా ముందు మాట్లాడటం న్యాయవ్యవస్థను తప్పుదారి పట్టించడమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. హైకోర్టుకే సెలవుల సమయంలో ఇలాంటి పరిమితులు ఉండగా, సిటీ సివిల్ కోర్టుకు సోషల్ మీడియా లేదా మీడియా కంటెంట్‌ను నియంత్రించే అధికారం ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు.
కొంతమంది లాయర్లు నల్లకోటు వేసుకొని కోర్టు ఇవ్వని ఆదేశాలను ఇచ్చినట్టుగా ప్రచారం చేయడం అడ్వకేట్ ఎథిక్స్‌కు వ్యతిరేకమని విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యక్తిగతంగా బీజేపీకి లేదా బండి సంజయ్‌కు మద్దతు ఇవ్వడం వేరు కానీ, కోర్టు పేరుతో సమాజాన్ని భయపెట్టడం వేరు అని వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రత్యేకంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారిని, మీడియా సంస్థలను బెదిరించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేసేలా వ్యవహరిస్తున్నారని విమర్శకులు అంటున్నారు. అమెరికా, లండన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఉన్న సోషల్ మీడియా యూజర్ల పోస్టులపై కూడా చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలో కానీ, బీఎన్ఎస్ లేదా బీఎన్ఎస్ఎస్ చట్టాల్లో కానీ ఇలాంటి నిషేధాలకు స్పష్టమైన ప్రావిజన్ లేదని న్యాయవర్గాల్లో చర్చ జరుగుతోంది. కోర్టు పేరు చెప్పి మీడియా గొంతు నొక్కే ప్రయత్నం ప్రమాదకరమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వ్యవహారంపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పందించి, తప్పుడు ప్రచారం చేసిన లాయర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ సమాజం బెదిరింపులకు భయపడదని, చరిత్రలో ఎన్నో నిరంకుశ శక్తులకు వ్యతిరేకంగా పోరాడిందని పలువురు గుర్తుచేస్తున్నారు.
తెలంగాణ ప్రజలు ఎప్పుడూ న్యాయం, బాధితుల పక్షానే నిలబడతారని, తప్పు చేసినవాడు ఎంతటి శక్తివంతుడైనా సమాజం అంగీకరించదని రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

