తెలంగాణలో ఓ ఆర్టీసీ డ్రైవర్ వ్యవహారం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. రైతుల సమస్యల గురించి మాట్లాడినందుకే తనపై చర్యలు తీసుకున్నారని జగిత్యాలకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్ ఆరోపించడంతో రాజకీయంగా కూడా ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది.
ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహిస్తున్న సమయంలో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సులో డ్రైవర్‌గా ఉన్న అశోక్ అక్కడున్న వ్యక్తులతో మాట్లాడారు. “పెట్రోల్ ధరల గురించి కాదు.. రైతుల వడ్ల సమస్యల గురించి మాట్లాడండి” అని ఆయన చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ మాటలను ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలుగా పరిగణించి తనను విధుల నుంచి తొలగించారని అశోక్ చెబుతున్నారు.
ఈ ఘటనపై స్పందించిన అశోక్.. తాను ఎలాంటి రాజకీయ పార్టీని గానీ, నాయకుడిని గానీ విమర్శించలేదని స్పష్టం చేశారు. రైతుల ఇబ్బందులు చూసి సాధారణంగా మాట్లాడానని చెప్పారు. “నేను కేవలం వడ్ల సమస్యల గురించి మాట్లాడండి అన్నాను. ఎవరినీ అవమానించలేదు. కానీ నన్ను డ్యూటీకి రావద్దని చెప్పారు. ఐదు డిపోలకు కూడా లెటర్లు పంపారని తెలిపారు” అని అశోక్ వాపోయారు.
ఈ ఘటనతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. రైతుల సమస్యలపై స్పందించినందుకే ఒక ఉద్యోగిని సస్పెండ్ చేయడం సరైన చర్యేనా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రజల సమస్యలపై స్పందించే హక్కు ఉద్యోగులకు లేదా? అని చాలామంది ప్రశ్నిస్తున్నారు.
అయితే ఈ వ్యవహారంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అశోక్ సస్పెన్షన్ విషయం తనకు తెలియదని, ఆర్టీసీ అధికారులు కూడా అధికారికంగా ఎలాంటి సస్పెన్షన్ చర్యలు తీసుకోలేదని చెప్పారు. “అతను వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే చెప్పాడు. ఉద్యోగ పరంగా ఎలాంటి ఇబ్బందులు కలిగించలేదు” అని మంత్రి తెలిపారు.
కానీ ఇదే సమయంలో అశోక్ మాత్రం తనకు రిమూవల్ లెటర్ వచ్చిందని చెబుతుండటంతో సందిగ్ధత నెలకొంది. అధికారికంగా ఎవరూ చర్యలు తీసుకోలేదంటే ఆ లెటర్ ఎలా వెళ్లింది? ఎవరు పంపించారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో స్పష్టత రావాలని ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ ఘటనపై పలువురు రైతు సంఘాల నేతలు కూడా స్పందించారు. రైతుల సమస్యలు తీవ్రంగా ఉన్న సమయంలో వాటిపై మాట్లాడిన ఉద్యోగిని టార్గెట్ చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం విమర్శలను స్వీకరించి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.
ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అశోక్‌పై నిజంగా సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారా? లేక అపార్థమా? అన్నదానిపై అధికారిక స్పష్టత కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

