కరీంనగర్‌కు రూ.840 కోట్ల వరద.. 100 రోజుల్లో మాట నిలబెట్టుకున్న కేంద్రం: బండి సంజయ్

కరీంనగర్ నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులు మంజూరు చేయడం పట్ల బీజేపీ ఎంపీ బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కరీంనగర్‌కు రూ.840 కోట్ల నిధులు కేటాయించడాన్ని చారిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణించారు. తాను ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లోనే నిధులు తీసుకొచ్చామని పేర్కొన్నారు.

కరీంనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన బండి సంజయ్.. ఈ నిధుల మంజూరుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి కృషి చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిన వెంటనే కేంద్రం స్పందించిందని, కేవలం 48 గంటల్లో సమావేశాలు నిర్వహించి ఫైళ్లను క్లియర్ చేశారని వెల్లడించారు. అధికారులు ఎంతో కష్టపడి పని చేశారని, వారి సహకారంతోనే ఈ ప్రాజెక్ట్ సాధ్యమైందన్నారు.

దేశవ్యాప్తంగా కేవలం 17 ప్రాజెక్టులకు మాత్రమే కేంద్రం ఆమోదం తెలిపిందని, అందులో కరీంనగర్‌కు చోటు దక్కడం గర్వకారణమన్నారు. ఇప్పటికే వరంగల్‌కు ఇలాంటి ప్రాజెక్ట్ మంజూరైన నేపథ్యంలో కరీంనగర్‌ను చేర్చడం కష్టమని కొందరు అధికారులు చెప్పినా.. తాము మొండి పట్టుదలతో సాధించామని తెలిపారు.

ఈ రూ.840 కోట్లతో కరీంనగర్ నగర రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇంటర్నల్ రోడ్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు, పార్కింగ్ సదుపాయాలు, పార్కులు, డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధికి ఈ నిధులు వినియోగించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా డంపింగ్ యార్డ్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూ.80 కోట్లు కేటాయించారని వెల్లడించారు.

గతంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ద్వారా రూ.749 కోట్ల నిధులు తీసుకొచ్చామని, అమృత్ పథకం కింద మరో రూ.279 కోట్లు వచ్చినట్లు తెలిపారు. అదనంగా అర్బన్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద రూ.50 కోట్లతో ఇప్పటికే టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించబోతున్నామని చెప్పారు. శివారు ప్రాంతాల అభివృద్ధికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు.

తాను పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత ఇప్పటివరకు రూ.20 వేల కోట్లకు పైగా నిధులు కరీంనగర్ పార్లమెంట్ పరిధికి తీసుకొచ్చినట్లు బండి సంజయ్ వెల్లడించారు. విద్యా రంగంలో భాగంగా లా కాలేజ్ అనుమతి 24 గంటల్లోనే తీసుకొచ్చామని, శాతవాహన యూనివర్సిటీకి 12B హోదా, ఎస్ఆర్ కాలేజీకి ఆటోనమస్ హోదా తీసుకొచ్చినట్లు చెప్పారు.

సిఆర్ఎఫ్ నిధులతో రోడ్ల అభివృద్ధి, స్టేడియంల నిర్మాణం, ప్రభుత్వ ఆస్పత్రుల ఆధునీకరణ వంటి పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదివే విద్యార్థులకు 20 వేల సైకిళ్లు పంపిణీ చేశామని, పేద విద్యార్థుల పరీక్ష ఫీజులను కూడా తన జీతంతో చెల్లించినట్లు పేర్కొన్నారు.

కరీంనగర్-వరంగల్ నేషనల్ హైవే పనులు వేగంగా సాగుతున్నాయని, కరీంనగర్-జగిత్యాల జాతీయ రహదారి టెండర్ ప్రక్రియ కూడా త్వరలో ప్రారంభమవుతుందని చెప్పారు. అలాగే సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్ బెటాలియన్ కేంద్రాలను కరీంనగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 14 ఎకరాల భూమిని కేటాయించిందని తెలిపారు.

ఈ బెటాలియన్ కేంద్రాలు వస్తే తెలంగాణకు చెందిన జవాన్లు కుటుంబాలకు దగ్గరగా పనిచేసే అవకాశం ఉంటుందని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధే తమ లక్ష్యమని, కరీంనగర్‌ను తెలంగాణలోనే మోడల్ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

చివరిగా ఈ నిధుల మంజూరుకు సహకరించిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులకు బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని వేల కోట్ల నిధులు తీసుకొచ్చి కరీంనగర్‌ను మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *