ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. భూసేకరణ ప్రక్రియను ఆలస్యం చేయకుండా స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు.
రెండు రోజుల పాలమూరు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాలు, జూరాల, కోయిల్ సాగర్, గూడెం దొడ్డి ప్రాంతాల్లో సాగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిల గెస్ట్ హౌస్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
అయితే భూసేకరణ అంశంపై రైతుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గతంలో పలు ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఆలస్యంగా అందడం లేదా పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదనే అభిప్రాయాలు ఇప్పటికీ ఉన్నాయి. దీంతో కొత్తగా చేపట్టే భూసేకరణ ప్రక్రియపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రైతు సంఘాల అభిప్రాయం ప్రకారం, కేవలం నగదు నష్టపరిహారం ఇవ్వడం కాకుండా “భూమికి భూమి” విధానాన్ని ప్రభుత్వం పరిశీలించాలి. ప్రస్తుతం భూముల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం అందించే నష్టపరిహారంతో ప్రత్యామ్నాయంగా వ్యవసాయ భూమిని కొనుగోలు చేయడం సాధ్యం కాదని వారు చెబుతున్నారు.
అలాగే రాష్ట్రంలో లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని ప్రభుత్వం గతంలో పేర్కొన్న నేపథ్యంలో, పరిశ్రమలు, డేటా సెంటర్లు, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టుల కోసం ముందుగా ప్రభుత్వ భూములను వినియోగించాలని రైతు వర్గాలు సూచిస్తున్నాయి.
ప్రాజెక్టుల నిర్మాణం రాష్ట్ర అభివృద్ధికి అవసరమే అయినప్పటికీ, భూములు కోల్పోయే రైతులకు పూర్తి న్యాయం, పారదర్శక నష్టపరిహారం, పునరావాసం కల్పించిన తర్వాతే భూసేకరణ చేపట్టాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన భూసేకరణ చేపట్టాలంటే అదే స్థాయిలో నష్టపరిహారం చెల్లింపు, పునరావాస చర్యలు కూడా వేగంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

