చెరువు బఫర్ జోన్‌లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు హైదరాబాద్‌లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇరిగేషన్ శాఖ స్పష్టంగా బఫర్ జోన్‌గా గుర్తించిన భూభాగాన్ని ఖాళీగా వదిలేయాలని నిబంధన విధించినప్పటికీ, మున్సిపల్ అధికారులు ఆ షరతులను పక్కనపెట్టి పూర్తి స్థలానికే నిర్మాణ అనుమతులు మంజూరు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అందుబాటులో ఉన్న పత్రాల ప్రకారం మొత్తం స్థలంలో 771 చదరపు మీటర్ల విస్తీర్ణాన్ని చెరువు రెడ్ బఫర్ జోన్‌గా గుర్తించిన ఇరిగేషన్ శాఖ, ఆ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని స్పష్టంగా పేర్కొంది. మిగిలిన భూమిలో మాత్రమే నిర్మాణాలు చేపట్టాలని ఎన్ఓసీలో షరతులు విధించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి నోటీసు లేకుండానే అనుమతులు రద్దు చేస్తామని కూడా హెచ్చరించింది.
అయితే 2023లో జారీ చేసిన బిల్డింగ్ పర్మిషన్‌లో మున్సిపల్ అధికారులు భిన్నమైన లెక్కలు చూపినట్లు ఆరోపణలు ఉన్నాయి. పర్మిషన్ పత్రాల్లో రోడ్ కటింగ్, నాలా కటింగ్ రెండూ ‘జీరో’గా చూపిస్తూ, ఇరిగేషన్ శాఖ మినహాయించాలని సూచించిన 771 చదరపు మీటర్ల బఫర్ జోన్‌ను పరిగణనలోకి తీసుకోకుండా మొత్తం స్థలాన్ని నిర్మాణయోగ్య భూమిగా పరిగణించినట్లు తెలుస్తోంది.
ఇరిగేషన్ మ్యాప్ ప్రకారం నిర్మాణాలు నిషేధించిన ప్రాంతంలోనే ఐదు అంతస్తుల భవన బ్లాకులు ప్రతిపాదించడమే కాకుండా, ఆ ప్లాన్‌ను యథాతథంగా అమలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సాటిలైట్ చిత్రాల్లో కూడా చెరువు కట్టకు అత్యంత సమీపంలో నిర్మాణాలు కనిపిస్తున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.
ముఖ్యంగా చెరువు ఊట ప్రాంతంలో సెల్లార్ తవ్వి, భారీ నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నీటి ప్రవాహానికి, భూగర్భ జలాల సహజ వ్యవస్థకు ఆటంకం కలిగే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యవహారంలో ప్రధానంగా బాధితులుగా మారేది ఫ్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలేనని స్థానికులు చెబుతున్నారు. బిల్డర్ అనుమతులు పొందిన తర్వాత ప్రాజెక్ట్‌ను విక్రయించి వెళ్లిపోతే, భవిష్యత్తులో బఫర్ జోన్ లేదా ఎఫ్‌టీఎల్ ఉల్లంఘనల పేరుతో చర్యలు తీసుకుంటే నష్టపోయేది నివాసితులేనని ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇరిగేషన్ శాఖ షరతులు, మున్సిపల్ అనుమతుల మధ్య ఉన్న వ్యత్యాసాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అనుమతుల మంజూరు ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయా, అధికారుల పాత్ర ఏమిటి, ప్రజలకు నష్టం కలిగే పరిస్థితి ఎందుకు ఏర్పడిందనే అంశాలపై లోతైన దర్యాప్తు అవసరమని స్థానికులు కోరుతున్నారు.

