ఇందిరమ్మ బస్సు యాత్ర పేరుతో కాంగ్రెస్ గిరిజనులను మోసం చేస్తోంది: రాజు రాథోడ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా “ఇందిరమ్మ బస్సు యాత్ర” పేరుతో రాజకీయ ప్రచారం నిర్వహించడం సరికాదని సేవాలాల్ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు రాజు రాథోడ్ విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అశోక్ రాథోడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి గిరిజనుల మద్దతు కీలకమని పేర్కొన్న రాజు రాథోడ్, ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా ఇప్పటివరకు అమలు కాలేదని ఆరోపించారు. గిరిజనులకు 10 శాతం నుంచి 12 శాతానికి రిజర్వేషన్లు పెంచుతామని చెప్పినా అమలు చేయలేదని, పోడు భూములకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారని విమర్శించారు.
గిరిజన యువతకు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయకపోవడం, నిరుద్యోగ సమస్యను పరిష్కరించకపోవడం ప్రభుత్వ వైఫల్యమని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ప్రజలకు ఏమి సాధించారని చెప్పేందుకు బస్సు యాత్ర నిర్వహిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
చేవెళ్ల డిక్లరేషన్లో ప్రకటించిన హామీలైన ఇంటర్ ఉత్తీర్ణులకు రూ.5 వేల భృతి, డిగ్రీ పూర్తిచేసిన వారికి రూ.10 వేల భృతి, పీజీ పూర్తిచేసిన వారికి రూ.15 వేల భృతి, లక్షల ఉద్యోగాల భర్తీ వంటి హామీలను ముందుగా అమలు చేసి తరువాత గిరిజన తండాలకు రావాలని సూచించారు.
గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఇచ్చిందని చెప్పడం సరికాదని, రిజర్వేషన్లు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో గిరిజనులకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని, సేవాలాల్ మహారాజ్ కార్పొరేషన్, తండాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు వంటి హామీలు కూడా అమలు కాలేదని విమర్శించారు.
ఇటీవల గిరిజనులకు సంబంధించిన వివిధ ఘటనలను ప్రస్తావించిన రాజు రాథోడ్, ఫ్యూచర్ సిటీ, ఫార్మా సిటీ భూ సమస్యలతో నష్టపోయిన బాధితులను ప్రభుత్వం పరామర్శించాలని, లగచర్ల ఘటన బాధితులకు న్యాయం చేయాలని, డీటీఓ వెంకన్న నాయక్ హత్యపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆహార విషబాధ ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లో ప్రకటించిన విద్యాజ్యోతి, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్, ఇందిరా మహిళా పథకం కింద రూ.6 లక్షల ఆర్థిక సహాయం వంటి హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ, సేవాలాల్ సేన మైదాన ప్రాంత కమిటీతో పాటు లంబాడి, ఎరుకుల, యానాది తదితర గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఇందిరమ్మ బస్సు యాత్రను వ్యతిరేకిస్తామని రాజు రాథోడ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా బస్సు యాత్ర కొనసాగిస్తే రాష్ట్రవ్యాప్తంగా తండాల్లో ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టి యాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు.

