గన్‌పార్క్ అమరవీరుల స్మారక స్థూపం చరిత్రలో నెల్లి లక్ష్మీనారాయణకు గుర్తింపు ఇవ్వాలి: ముదిరాజ్ సంక్షేమ సమితి

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం స్వాగతించదగ్గ నిర్ణయమని ముదిరాజ్ సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు అల్లాదురం సురేష్ ముదిరాజ్ పేర్కొన్నారు. కేశవరావు అధ్యక్షతన ఏర్పాటైన కమిటీకి తమ వినతిని సమర్పించినట్లు తెలిపారు.

తెలంగాణ ఉద్యమానికి విశేష సేవలందించిన నిజమైన ఉద్యమకారులకు ఇప్పటికీ సరైన గుర్తింపు లభించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గన్‌పార్క్‌లోని అమరవీరుల స్మారక స్థూపం పునాది వేసిన మాజీ హైదరాబాద్ తొలి మేయర్ నెల్లి లక్ష్మీనారాయణ సేవలను ప్రభుత్వం అధికారికంగా గుర్తించాలని డిమాండ్ చేశారు.

1969 తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల జ్ఞాపకార్థం గన్‌పార్క్‌లో స్మారక స్థూపం నిర్మించాలని అప్పటి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానం చేసిందని తెలిపారు. అయితే అప్పటి ప్రభుత్వం వ్యతిరేకించినప్పటికీ, పోలీసుల కట్టుదిట్టమైన నిఘాను తప్పించుకుని నెల్లి లక్ష్మీనారాయణ గన్‌పార్క్‌కు చేరుకుని స్మారక స్థూపానికి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. అనంతరం ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయాన్ని వివరించారు.

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో సజీవంగా ఉంచేందుకు తన పదవిని సైతం లెక్కచేయకుండా పోరాడిన నాయకుడిగా నెల్లి లక్ష్మీనారాయణను చరిత్ర గుర్తుంచుకోవాలని అన్నారు. అయితే ఇప్పటివరకు ఆయనకు తగిన గౌరవం దక్కలేదని, ఇది విచారకరమని పేర్కొన్నారు.

ముదిరాజ్ సంక్షేమ సమితి తరఫున ప్రభుత్వం ముందు ఈ ప్రధాన డిమాండ్లను ఉంచుతున్నట్లు తెలిపారు:

  • నెల్లి లక్ష్మీనారాయణను అధికారికంగా తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తించాలి.
  • ఆయనకు పద్మశ్రీ పురస్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయాలి.
  • గన్‌పార్క్‌కు “నెల్లి పార్క్”గా పేరు మార్చాలని పరిశీలించాలి.
  • తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఆయన పాత్రను పాఠ్యాంశాలు, ప్రభుత్వ ప్రచురణల్లో పొందుపరచాలి.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ చరిత్రను సమగ్రంగా పరిశీలించి, ఉద్యమానికి సేవలందించిన ప్రతి ఒక్కరికి సముచిత గుర్తింపు కల్పించాలని ముదిరాజ్ సంక్షేమ సమితి విజ్ఞప్తి చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *