ప్రక్షాళనతో సరిపోతుందా? ప్రజల నమ్మకం తిరిగి గెలుచుకోవడం బీఆర్ఎస్‌కు అతిపెద్ద సవాల్!

తెలంగాణలో వరుస ఎన్నికల పరాజయాల తర్వాత బీఆర్ఎస్ పార్టీని మళ్లీ బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టి సారించారు. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో పార్టీకి ఎదురైన వరుస ఎదురుదెబ్బల నేపథ్యంలో నాయకత్వ సమన్వయం, కేడర్‌లో ఆత్మవిశ్వాసం పెంపు, ప్రజల్లో మళ్లీ పార్టీపై నమ్మకం కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలుచుకుంది. అనంతరం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగింది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, రామగుండం కార్పొరేషన్ సహా పలు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో బీఆర్ఎస్ కేడర్‌లో నిరుత్సాహం నెలకొంది.

ఈ పరిస్థితిని మార్చేందుకు కేటీఆర్ క్షేత్రస్థాయిలో పార్టీని పునర్వ్యవస్థీకరించే పనిని ప్రారంభించారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావం, కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతుల జాప్యం, సాగు-తాగునీటి సమస్యలను ప్రధాన రాజకీయ అజెండాగా తీసుకుని ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది.

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు చేపట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ అంశాన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్లేందుకు కేటీఆర్ కన్నేపల్లి పంప్ హౌస్ సందర్శించడం, మాజీ మంత్రి హరీష్ రావు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రభుత్వంపై విమర్శలు చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు కూడా ప్రెస్‌మీట్లు, నిరసన కార్యక్రమాలతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు.

అదే సమయంలో పార్టీలోని అంతర్గత విభేదాలను తగ్గించడంపైనా అధిష్టానం దృష్టి పెట్టింది. ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు కొరకంటి చందర్, కౌశిక్ హరి, వ్యాల హరీష్ రెడ్డి వేర్వేరుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయంతో కేటీఆర్ స్వయంగా వారితో సమావేశమై కలిసి పనిచేయాలని సూచించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు జిల్లాలో సమన్వయ బాధ్యతలు అప్పగించారు. అనంతరం ముగ్గురు నాయకులు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి పార్టీ బలోపేతానికి కలిసి పనిచేస్తామని ప్రకటించారు.

అయితే, రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం నాయకుల మధ్య సమన్వయం సాధించడం ఒక్కటే సరిపోదు. ఉద్యమ సమయంలో బీఆర్ఎస్‌పై ప్రజల్లో ఏర్పడిన విశ్వాసం ప్రస్తుతం కనిపించడం లేదని వారు అంటున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్‌పై ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్‌కు అవకాశం లభించిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని విశ్లేషిస్తున్నారు.

దీంతో ప్రస్తుతం ప్రజలు ఏ పార్టీని నమ్మాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారని, ఈ పరిస్థితిలో బీఆర్ఎస్ ముందు ఉన్న అతిపెద్ద సవాల్ ప్రజల విశ్వాసాన్ని తిరిగి గెలుచుకోవడమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్లోకి రావడం, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రజా సమస్యలపై గళం వినిపించడం అవసరమని పార్టీ శ్రేణుల నుంచే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన నాయకుడిగా కేసీఆర్ ప్రజల ముందుకు వచ్చి పార్టీ భవిష్యత్ కార్యాచరణను స్పష్టంగా వివరించాలని కార్యకర్తలు భావిస్తున్నారు.

మొత్తంగా చూస్తే నాయకుల ప్రక్షాళన, సమన్వయం, క్షేత్రస్థాయి కార్యక్రమాలు పార్టీకి కొంత ఉత్సాహాన్ని తీసుకురావొచ్చు. కానీ ప్రజల్లో కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి సాధించగలిగితేనే బీఆర్ఎస్ పూర్వ వైభవం సాధించే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *