అక్కినేని వారసుడు అఖిల్ కెరీర్ ప్రారంభమై దశాబ్దం దాటింది. 2015లో అఖిల్ సినిమాతో హీరోగా లాంచ్ అయిన ఆయన నుంచి అభిమానులు భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్నారు. కానీ తొలి సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. ఆ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకుని వచ్చిన హలో యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది. డెస్టినీ నేపథ్యంతో రూపొందిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ అక్కినేని అభిమానుల అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది.
సక్సెస్ కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువే
తదుపరి రెండేళ్ల గ్యాప్ తర్వాత 2019లో వచ్చిన మిస్టర్ మజ్ను అఖిల్ కెరీర్‌లో తొలి భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత 2021లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ద్వారా కొంత రికవరీ అయినప్పటికీ, అది కూడా పూర్తి స్థాయి స్టార్ ఇమేజ్ తీసుకురాలేకపోయింది. ఇక భారీ అంచనాల మధ్య తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ఏజెంట్ మాత్రం అఖిల్ కెరీర్‌లో రెండో పెద్ద దెబ్బగా మారింది. ఈ సినిమా ఫలితంతో అఖిల్ దాదాపు మూడేళ్ల పాటు తెరపై కనిపించలేదు.
ఈ పదేళ్ల కెరీర్‌ను చూసుకుంటే, అఖిల్ విజయాల కంటే పరాజయాలే ఎక్కువగా ఎదుర్కొన్నాడు. దీంతో ఇకపై ప్రతి అడుగూ ఆచితూచి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అన్ని వైపులా పాజిటివ్ వైబ్స్
ఈ నేపథ్యంతో అఖిల్ తన తదుపరి సినిమా విషయంలో పూర్తిగా మారిన దృక్పథాన్ని అవలంబించాడు. నేల విడిచి సాము చేయకుండా, రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో లెనిన్ అనే సినిమాను ఎంచుకున్నాడు. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రచార చిత్రాలతోనే మంచి హైప్ తెచ్చుకుంది. అఖిల్ సీమ యాసలో చెప్పిన డైలాగులు, అతని గెటప్, ఆహార్యం అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. కొత్త ఏడాది ప్రథమార్థంలోనే లెనిన్ విడుదల కానున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాపై అన్ని వైపులా పాజిటివ్ వైబ్ కనిపించడం అఖిల్ అభిమానులకు ఊరటనిస్తోంది.
2026 అఖిల్‌కు కలిసొస్తుందా?
ఇటీవల ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం, అఖిల్‌కు 2026 మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందని అంటున్నారు. కంటెంట్ పరంగా లెనిన్లో ఎలాంటి బలహీనతలు లేవని, పైగా అఖిల్ జాతక రీత్యా కూడా సంకల్పించిన పనులు విజయవంతమవుతాయని ఆయన సన్నిహితుల మధ్య చర్చ జరుగుతోందట. అదే నిజమైతే, అఖిల్ అసలైన సక్సెస్‌ను 2026లో చూడటం ఖాయమేనన్న నమ్మకం వ్యక్తమవుతోంది.
కొత్త కథలపై ఫోకస్
లెనిన్ షూటింగ్ పూర్తైన నేపథ్యంలో అఖిల్ కొత్త కథల విషయంలోనూ సీరియస్‌గా డిస్కషన్స్ చేస్తున్నాడట. ఇప్పటికే పలువురు రచయితలు కథలు వినిపించగా, నచ్చిన వాటిని లాక్ చేసినట్లు సమాచారం. ఒకవేళ లెనిన్ అఖిల్‌కు బ్రేక్ ఇస్తే, అక్కినేని అభిమానులకు డబుల్ ట్రీట్ ఖాయమనే చెప్పాలి.

