తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, కవి అందెశ్రీ (అసలు పేరు: అందె ఎల్లయ్య) ఇక లేరు. సోమవారం ఉదయం లాలాపేట్‌లోని తన నివాసంలో కుప్పకూలిన ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు మరణించినట్లు ధృవీకరించారు. ఈ వార్తతో తెలంగాణ సాహితీ, సాంస్కృతిక రంగాలన్నీ దుఃఖంలో మునిగిపోయాయి.
అందెశ్రీ అంతిమయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. లాలాపేట్ నుంచి ఘట్‌కేసర్ వరకు సాగిన అంతిమయాత్రలో ప్రజలు, అభిమానులు, కవులు కన్నీరుమున్నీరయ్యారు. ఘట్‌కేసర్ ఎన్ఎఫ్‌సీ నగర్‌లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పాడె మోసి అందెశ్రీకి నివాళులర్పించారు, భావోద్వేగానికి లోనయ్యారు. “అందెశ్రీ మృతి కవులకు మాత్రమే కాదు, వ్యక్తిగతంగా నాకు కూడా తీరని లోటు” అని అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అందెశ్రీని కలిసిన సందర్భాలను గుర్తుచేసుకుంటూ ఆయనను తాను ఎప్పటికీ మరిచిపోలేనని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “అందెశ్రీ తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ఆయన నిస్వార్ధ సేవలకు గుర్తింపుగా ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించాం” అని తెలిపారు. అంతేకాకుండా, అందెశ్రీ అంత్యక్రియల స్థలంలో స్మృతి వనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది జూన్ 2న సీఎం చేతుల మీదుగా కోటి రూపాయల నగదు పురస్కారం అందుకున్న అందెశ్రీ, “జయజయహే తెలంగాణ” గీతం ద్వారా రాష్ట్ర ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచారు.

