బిఆర్ఎస్ నేత బల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలను తగలబెట్టాలని, రైలు పట్టాలు తొలగించాలని చేసిన వ్యాఖ్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పనిచేసిన నాయకులు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని, రాష్ట్ర ప్రజలందరూ దీనిపై ఆలోచించాలని అన్నారు.
ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు బల్క సుమన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బిఆర్ఎస్ పార్టీ చేపడుతున్న ధర్నాలకు ప్రజలు స్పందించడం లేదని, రైతుల పేరుతో నిర్వహిస్తున్న ఉద్యమాలకు నిజమైన రైతులు రావడం లేదని స్వయంగా బల్క సుమన్ ఒప్పుకున్నారని పేర్కొన్నారు. బిఆర్ఎస్ కార్యకర్తలతోనే కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో అటెన్షన్ పొందేందుకు ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణలో ప్రస్తుతం శాంతియుత పరిస్థితులు ఉన్నాయని, ప్రజా ప్రభుత్వం మెరుగైన పరిపాలన అందిస్తోందని పేర్కొంటూ, ఈ పరిస్థితిని భంగం కలిగించేందుకే బిఆర్ఎస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ కార్యాలయాలను తగలబెట్టాలని, రైలు పట్టాలను కోయాలని చెప్పడం తీవ్రవాద చర్యలకు ప్రేరేపించడమేనని విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యలు ఒక రాజకీయ నాయకుడు కాకుండా తీవ్రవాది మాట్లాడినట్టుగా ఉన్నాయని మండిపడ్డారు
.ముఖ్యమంత్రి, మంత్రులు కూడా భద్రత తగ్గించుకొని ప్రజల్లోకి వెళ్తున్న ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు మరింత ప్రమాదకరమని పేర్కొన్నారు. రాష్ట్ర డీజీపీ వెంటనే సుమోటోగా కేసు నమోదు చేసి, బల్క సుమన్ వ్యాఖ్యల వెనుక ఏమైనా కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ సీఎం కేసీఆర్ కూడా దీనిపై స్పందించాలని కోరారు. నిజంగా తెలంగాణ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఉంటే బల్క సుమన్‌ను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ప్రజల సుఖసంతోషాల కోసం జరిగిందని, కానీ ఇప్పుడు కొందరు నాయకులు అధికార దాహంతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
ఈ అంశంపై ప్రభుత్వ విప్ మరియు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి డీజీపీకి ఫిర్యాదు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. బల్క సుమన్ చేసిన వ్యాఖ్యల ఆడియో క్లిప్పింగ్స్, పత్రికా కథనాలు, ఆధారాలను పెన్ డ్రైవ్‌లో జతచేసి అధికారులకు అందజేస్తామని తెలిపారు. తెలంగాణలో శాంతిభద్రతలు దెబ్బతినకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

