అకాల వర్షంతో అన్నదాతల ఆవేదన.. నీట మునిగిన ధాన్యం, కొనుగోళ్లలో ఆలస్యం రైతులకు శాపం

తెలంగాణలో అకాల వర్షాలు అన్నదాతలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఇప్పటికే పంట కోతలు పూర్తి చేసి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన రైతులు ఇప్పుడు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. వరుసగా రెండు రోజుల పాటు కురిసిన వర్షాలతో పలు జిల్లాల్లో ధాన్యం కుప్పలు నీట మునిగిపోయాయి. కొనుగోలు కేంద్రాలు చిన్నపాటి చెరువులను తలపించే పరిస్థితి నెలకొంది.

మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షాలకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడవకుండా కాపాడేందుకు రైతులు రాత్రికి రాత్రే పరుగులు పెట్టినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. కొన్నిచోట్ల సరిపడా టార్పాలిన్లు లేకపోవడం, మరికొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలు లోతట్టు ప్రాంతాల్లో ఉండటంతో నీరు నిలిచి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది.

ప్రభుత్వం తరఫున అదనపు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చినట్టు అధికారులు చెబుతున్నా, రైతులు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “తడిసిన ధాన్యం కూడా కొంటాం” అని మంత్రులు చెబుతున్నా, అసలు ప్రశ్న “ఎప్పుడు కొంటారు?” అనేదేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం కేవలం కొంత శాతం మాత్రమే కొనుగోలు పూర్తి చేసిందని, మిగతా ధాన్యం ఇంకా కేంద్రాల్లోనే పేరుకుపోయి ఉందని రైతులు చెబుతున్నారు.

రైతుల వాదన ప్రకారం, వర్షాకాలం దగ్గరపడుతుందని ముందే తెలిసినా ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదని ఆరోపిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, గోదాములు, సరిపడా సిబ్బంది, రవాణా సదుపాయాలు ముందుగానే ఏర్పాటు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదని అంటున్నారు.

ఇప్పటికే యూరియా కొరతతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, రోజులు తరబడి లైన్లలో నిలబడి ఎరువులు తెచ్చుకున్నారని గుర్తుచేస్తున్నారు. కుటుంబ సభ్యులను కూడా లైన్లలో నిలబెట్టి ఎరువులు తెచ్చుకున్నామని, ఇప్పుడు అదే కష్టంతో పండించిన పంట చేతికందే సమయంలో వర్షాలకు నాశనం అవుతుండటం చూసి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం, సరైన ప్రణాళిక లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని రైతులు ఆరోపిస్తున్నారు. “తడిసిన ధాన్యం కూడా కొంటాం” అని చెప్పడం సరిపోదని, తడవకముందే ఎందుకు కొనుగోలు పూర్తి చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే 20 రోజుల నుంచి నెలరోజుల వరకు ధాన్యం కేంద్రాల్లోనే ఉండిపోయిందని, రైతులు తమ సొంత ఖర్చులతో బస్తాలు తెచ్చుకొని ధాన్యం నింపి నిల్వ ఉంచారని చెబుతున్నారు.

పంటను కాపాడుకోవడానికి రైతులు పడుతున్న కష్టాలు చూసినా అధికారులు, నాయకులు స్పందించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లు వేగవంతం చేసి, తడిసిన ధాన్యానికి సరైన మద్దతు ధర ప్రకటించి, నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *