రాష్ట్రంలో ఇప్పటికే పంటలు సిద్ధంగా ఉండగా, ఇంకా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం రైతుల్లో ఆగ్రహాన్ని రేపుతోంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాలతో రైతుల ధాన్యం తడిసి ముద్దయిపోయింది. అయినా సరే, రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ప్రొక్యూర్మెంట్ సెంటర్లను ప్రారంభించకపోవడం రైతులపై నిర్లక్ష్యాన్ని చూపుతోందని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపించారు.
బీజేపీ నాయకులు వ్యాఖ్యానిస్తూ — “రైతుల పంటలు తడిసిపోతుంటే ప్రభుత్వం మాత్రం ఎలక్షన్ రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోంది. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులకు తక్షణమే ఎంఎస్పీ (MSP) రేటు ప్రకారం చెల్లింపులు జరపాలి” అని డిమాండ్ చేశారు.
ఇదే సందర్భంలో వారు రైస్ మిల్లర్లను కూడా హెచ్చరించారు. తడిసిన ధాన్యం పేరుతో రైతులపై 8%–10% డిస్కౌంట్ వేస్తే తగిన చర్యలు తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా నేతలు తెలిపారు.
అలాగే, కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎంఎస్పీని 2014లోని ₹1300 నుంచి ₹2389కి పెంచిందని, ఇది 82% పెరుగుదల అని గుర్తు చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రం నుంచి వచ్చిన నిధులను వేరే దారికి మళ్లించి రైతులకు ఇబ్బందులు కలిగిస్తోందని ఆరోపించారు.
రైతులకు తక్షణమే నష్టపరిహారం, కొనుగోలు కేంద్రాల ప్రారంభం, మరియు ఎంఎస్పీ రేటు చెల్లింపులు జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

