మృగశిర కార్తె చేప ప్రసాదం నేడు ప్రారంభం.. లక్షలాది ఆస్తమా బాధితుల రాకకు భారీ ఏర్పాట్లు

హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం నిర్వహించే మృగశిర కార్తె చేప ప్రసాద పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆస్తమా మరియు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వేలాది మంది ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కార్యక్రమం సోమవారం రాత్రి 9 గంటలకు నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రారంభం కానుంది. కార్యక్రమం నిరవధికంగా 24 గంటల పాటు కొనసాగనుండగా, అనంతరం దూద్‌బౌలిలోని బత్తిన కుటుంబ నివాసంలో మరో మూడు రోజుల పాటు చేప ప్రసాదం పంపిణీ జరగనుంది.

తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఆస్తమా బాధితులు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఇప్పటికే ఆదివారం రాత్రి నుంచే అనేక మంది ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు చేరుకోవడంతో అక్కడ సందడి నెలకొంది.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో భారీ షెడ్లు, ఫ్లడ్‌లైట్లు, ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయగా, ఆర్టీసీ ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచింది. జీహెచ్‌ఎంసీ శానిటేషన్ పనులు చేపట్టగా, జలమండలి తాగునీటి సరఫరా కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంది.

ఈసారి చేప ప్రసాదాన్ని దివంగత బత్తిన హరినాథ్ గౌడ్ కుమారుడు అమర్‌నాథ్ గౌడ్, ఆయన సోదరుడు గౌరీశంకర్ పంపిణీ చేయనున్నారు. లక్షలాది మంది రానున్న నేపథ్యంలో 34 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. దివ్యాంగులు, వృద్ధులు, మహిళల కోసం ప్రత్యేక క్యూలైన్లు కూడా ఏర్పాటు చేశారు.

మత్స్యశాఖ ఇప్పటికే సుమారు 1.4 లక్షల కొరమీన చేప పిల్లలను సిద్ధంగా ఉంచింది. శాఖాహారుల కోసం బెల్లంతో తయారు చేసిన ప్రత్యేక ప్రసాదాన్ని అందించనున్నారు. చిన్నపిల్లల నుంచి వందేళ్ల వృద్ధుల వరకు ఎవరైనా ఈ ప్రసాదాన్ని తీసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. అయితే గర్భిణీలు మాత్రం తీసుకోవద్దని స్పష్టం చేశారు.

ప్రసాదం తీసుకునే వారు పరగడుపున లేదా భోజనం చేసిన మూడు గంటల తర్వాత మాత్రమే తీసుకోవాలని సూచించారు. పెద్దలకు రూ.50, పిల్లలకు రూ.40 చెల్లించి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.

సోమవారం రాత్రి 9 గంటలకు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, మహమ్మద్ అజారుద్దీన్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా ఆహారం, తాగునీరు అందించేందుకు ముందుకొచ్చాయి.

సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు, జూబ్లీ బస్ స్టేషన్, మహాత్మా గాంధీ బస్ స్టేషన్, ఈసీఐఎల్ ఎక్స్ రోడ్స్, శంషాబాద్ విమానాశ్రయం తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక వైద్య బృందాలు, అంబులెన్సులను సిద్ధంగా ఉంచింది.

శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ చేప ప్రసాద కార్యక్రమం కోసం లక్షలాది మంది భక్తులు, ఆస్తమా బాధితులు హైదరాబాద్‌కు తరలివస్తుండగా, నగరం మరోసారి ఆధ్యాత్మిక మరియు వైద్య విశ్వాసాల సమ్మేళనానికి వేదికగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *