తెలంగాణలో రైతులకు ఉచిత విద్యుత్ సరఫరాపై రాజకీయ వేడి మరింత పెరిగింది. రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్న ప్రభుత్వ వాదనలను ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో రైతులకు మూడు గంటల కరెంట్ చాలని వ్యాఖ్యానించారని, తాజాగా రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని అధికారిక వేదికపై వ్యక్తం చేశారని ఆరోపించారు.
ఈఆర్సీ (విద్యుత్ నియంత్రణ కమిషన్) ముందు జరిగిన విచారణలో రైతాంగానికి మూడు గంటల కరెంట్ సరిపోతుందని కాంగ్రెస్ తరఫున వాదనలు వినిపించారని పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలు అధికారిక రికార్డుల్లో ఉన్నాయని తెలిపారు.
రాష్ట్రంలో ప్రస్తుతం రైతులకు 24 గంటల విద్యుత్ అందడం లేదని, అనేక ప్రాంతాల్లో 13 గంటలకు మించి కరెంట్ రావడం లేదని ఆరోపించారు. నర్సాపూర్, జహీరాబాద్, సిద్దిపేట తదితర ప్రాంతాల సబ్స్టేషన్లను సందర్శించినప్పుడు రైతులు ఇదే సమస్యను వెల్లడించారని చెప్పారు.
ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ రిన్యూవబుల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (టీజీఆర్పీడీసీఎల్)పై కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.8 ప్రకారం కొత్త డిస్కంకు అధిక శాతం పునరుత్పాదక విద్యుత్ (Renewable Energy) కేటాయించనున్నట్లు పేర్కొన్నారని గుర్తు చేశారు.
పునరుత్పాదక విద్యుత్ అంటే ప్రధానంగా సౌరశక్తి అని, సౌర విద్యుత్ ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని అన్నారు. రైతులు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, తాగునీటి ప్రాజెక్టులను టీజీఆర్పీడీసీఎల్ పరిధిలోకి తీసుకువచ్చి, వాటికి ప్రధానంగా సోలార్ పవర్ కేటాయిస్తే భవిష్యత్తులో రైతులకు కేవలం 8 నుంచి 9 గంటల విద్యుత్ మాత్రమే అందే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
గుజరాత్లో రైతులకు సుమారు ఏడు గంటలు, కర్ణాటకలో ఎనిమిది గంటల విద్యుత్ మాత్రమే అందుతోందని పేర్కొంటూ, తెలంగాణలో కూడా అదే పరిస్థితి తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేతలు బహిరంగ సవాల్ విసిరారు. “రాష్ట్ర రైతాంగానికి నిరంతరాయంగా 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తేనే ఓట్లు అడుగుతానని ప్రకటించగలరా?” అని ప్రశ్నించారు. రైతుల ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని, విద్యుత్ సరఫరాపై వాస్తవ పరిస్థితులను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.

