తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పెన్షన్ పథకంలో భారీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. పథకాన్ని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన లైవ్ ఆథెంటికేషన్ ప్రక్రియలో వేలాది మంది అనర్హులు పెన్షన్లు పొందుతున్నట్లు గుర్తించారు.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం, బ్యాంకు ఖాతాల ద్వారా పెన్షన్లు పొందుతున్న 19.4 లక్షల మందికి పైగా లబ్ధిదారుల్లో ఇప్పటివరకు 15.93 లక్షల మంది లైవ్ ఆథెంటికేషన్ పూర్తి చేశారు. అంటే మొత్తం లబ్ధిదారుల్లో దాదాపు 83.88 శాతం మంది ధృవీకరణ పూర్తిచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా మూడు లక్షలకు పైగా లబ్ధిదారులు ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది.
ఈ పరిశీలనలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇప్పటికే మరణించిన 41 వేల మందికి పైగా వ్యక్తుల పేర్లపై ఇప్పటికీ పెన్షన్లు కొనసాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. సంబంధిత కుటుంబ సభ్యులే వారి మరణాన్ని ధృవీకరించినట్లు సమాచారం.
అంతేకాకుండా సుమారు 14 వేల మంది లబ్ధిదారులు ఎక్కడ ఉన్నారో గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. వీరిని “నాట్ ట్రేసబుల్” జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. మరో 3,475 మంది ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్నప్పటికీ తెలంగాణలో పెన్షన్లు పొందుతున్నట్లు గుర్తించారు
అంతేకాకుండా సుమారు 14 వేల మంది లబ్ధిదారులు ఎక్కడ ఉన్నారో గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. వీరిని “నాట్ ట్రేసబుల్” జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. మరో 3,475 మంది ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్నప్పటికీ తెలంగాణలో పెన్షన్లు పొందుతున్నట్లు గుర్తించారు.
ఇంకా 100 మందికి పైగా లబ్ధిదారులు తమకు ఇకపై పెన్షన్ అవసరం లేదని స్వచ్ఛందంగా ప్రకటించారు. ఉపాధి లేదా ఇతర ఆదాయ వనరులు లభించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
అదేవిధంగా దాదాపు 10 వేల మంది లబ్ధిదారుల ఆధార్ కార్డులు రద్దయినట్లు గుర్తించారు. డూప్లికేట్ లేదా బహుళ ఆధార్ నమోదు కారణంగా ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది.
ఈ మొత్తం ప్రక్రియలో ఇప్పటివరకు 50 వేల మందికి పైగా అనర్హులను గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా లేవనెత్తబడుతున్న ప్రశ్న ఏమిటంటే — ఈ ధృవీకరణ ప్రక్రియను ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నెలల్లోనే ఎందుకు చేపట్టలేదన్నది.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తవుతున్న సమయంలో ఈ అక్రమాలు బయటపడటం విమర్శలకు తావిస్తోంది. ఈ కాలంలో అనర్హుల ఖాతాల్లో కోట్లాది రూపాయల ప్రజాధనం జమ అయినట్టే కదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇంకో ముఖ్యమైన అంశం ఏమిటంటే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్లను పెంచుతామని హామీ ఇచ్చింది. సాధారణ పెన్షన్‌ను రూ.4,000కు, వికలాంగుల పెన్షన్‌ను రూ.6,000కు పెంచుతామని ప్రకటించింది. అయితే ఇప్పటివరకు ఆ హామీల అమలుపై స్పష్టత లేకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది.
అనర్హుల తొలగింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత నిజమైన అర్హులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉన్నప్పటికీ, ఈ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభం కావడం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం లైవ్ ఆథెంటికేషన్ కొనసాగుతుండగా, ఇంకా వేలాది కేసుల్లో పరిశీలన జరగాల్సి ఉంది. తుది జాబితా వెలువడిన తర్వాత మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

