తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై రైతుల ఆవేదన రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే అకాల వర్షాలతో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు, మరోవైపు ప్రభుత్వ కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. “25 రోజులుగా ధాన్యం కల్లంలోనే ఉంది.. ఇంకా లారీలు రావడం లేదు.. ట్రాక్టర్లు రావడం లేదు” అంటూ రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఒక రైతు మాట్లాడుతూ, “బస్తాలు మేమే కొనుక్కొచ్చాం, మేమే నింపుకున్నాం. 25 రోజుల నుంచి ధాన్యం కల్లంలోనే ఉంది. ఇంకా ఎప్పుడు తీసుకెళ్తారో తెలీదు. లారీలు రావట్లేదంటారు, ట్రాక్టర్లు దొరకట్లేదంటారు. కాంటా కూడా రావట్లేదు. వర్షం వస్తే మా పరిస్థితి ఏంటి?” అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
రైతులు చెబుతున్న ప్రకారం, నెల రోజులుగా కొనుగోళ్ల ప్రక్రియ సరిగా జరగకపోవడంతో కుటుంబ సభ్యులంతా కల్లాల దగ్గరే పడిగాపులు కాస్తున్నారు. “నడిఎండలో ఇక్కడే ఉండాలి. పిల్లలను కూడా తీసుకువచ్చాం. తినడానికి సరిగ్గా లేదు. ఎవరూ సహాయం చేయడం లేదు” అని మరో రైతు వాపోయాడు.
ప్రభుత్వంపై కూడా రైతులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. “ప్రభుత్వం కొనకపోతే మేము ప్రైవేట్‌లో అయినా అమ్ముకునే వాళ్లం. కానీ అది కూడా చేయనివ్వడం లేదు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు” అని మండిపడ్డారు.
రైతు బంధు, రైతు భరోసా అంశాలపైనా అసంతృప్తి వ్యక్తమవుతోంది. “రూ.12 వేలిస్తామని చెప్పారు. కానీ విడతలుగా రూ.6 వేలే ఇచ్చారు. మిగతా డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు. రైతు రుణమాఫీ కూడా పూర్తిగా కాలేదు” అంటూ రైతులు ఆరోపిస్తున్నారు.
కొంతమంది రైతులు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంను గుర్తు చేసుకుంటూ, “కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ఒక్కసారే పడేది. రుణమాఫీ కూడా జరిగేది. ఇప్పుడు మాటలు ఎక్కువ, పనులు తక్కువ” అని వ్యాఖ్యానించారు.
అకాల వర్షాలు, యూరియా కొరత, ధాన్యం కొనుగోళ్ల ఆలస్యం, రవాణా సమస్యలు అన్నీ కలిసి రైతులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేశాయని రైతులు చెబుతున్నారు. “పంట పండించే సమయంలో యూరియా దొరకలేదు. ఇప్పుడు పండించిన ధాన్యం కొనడం లేదు. రైతు పరిస్థితి మరింత దారుణంగా మారింది” అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అకాల వర్షాలు, యూరియా కొరత, ధాన్యం కొనుగోళ్ల ఆలస్యం, రవాణా సమస్యలు అన్నీ కలిసి రైతులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేశాయని రైతులు చెబుతున్నారు. “పంట పండించే సమయంలో యూరియా దొరకలేదు. ఇప్పుడు పండించిన ధాన్యం కొనడం లేదు. రైతు పరిస్థితి మరింత దారుణంగా మారింది” అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని తక్షణమే తరలించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

