జగిత్యాల జిల్లాలో కేంద్రీయ విద్యాలయం మరియు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌లకు సరిపడా భూమి కేటాయించాలని కోరుతూ ఓ సామాజిక కార్యకర్త వీడియో ద్వారా రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లకు విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ల కోసం 20 నుంచి 25 ఎకరాల వరకు భూమి కేటాయిస్తోందని, ఇతర నియోజకవర్గాల్లో కూడా అదే విధంగా భూములు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే జగిత్యాలలో మాత్రం కేవలం రెండు ఎకరాలు మాత్రమే కేటాయించడం సరైన నిర్ణయం కాదని విమర్శించారు.
కేంద్రీయ విద్యాలయాల కోసం కనీసం ఐదు ఎకరాలు, మెరుగైన సదుపాయాల కోసం పది ఎకరాలు అవసరమని కేంద్ర మార్గదర్శకాలు చెబుతున్నాయని తెలిపారు. కానీ జగిత్యాలలో అధికారులు చూపిస్తున్న భూములు పట్టణానికి దూరంగా ఉండటంతో పాటు, విద్యార్థులకు అనుకూలంగా లేవని ఆరోపించారు.
ఇప్పటికే అధికారులు పరిశీలించిన కొన్ని ప్రాంతాల్లో డంప్‌యార్డులు, క్రషర్లు, గుట్టలు ఉన్నాయని, అవి విద్యాసంస్థలకు అనువైన ప్రదేశాలు కావని అన్నారు. విద్యార్థులు సులభంగా రాకపోకలు సాగించేందుకు పట్టణానికి సమీపంలోనే విస్తారమైన స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జగిత్యాలను విద్యా హబ్‌గా అభివృద్ధి చేయాలంటే రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని, భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కనీసం 10 ఎకరాలు కేంద్రీయ విద్యాలయానికి, 25 ఎకరాలు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
విద్యార్థులకు ఆటస్థలాలు, భవిష్యత్‌లో విస్తరణకు తగిన స్థలం, అన్ని రకాల విద్యా సదుపాయాలు ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని కూడా విజ్ఞప్తి చేశారు.

