ఫారెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం… కీలక ఆధారాల భద్రతపై అనుమానాలు

రాష్ట్రంలో వరుసగా నమోదవుతున్న దొంగతనాల కేసుల దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఫారెన్సిక్ ల్యాబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదం పలు అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా క్లూస్ టీమ్ సేకరించిన కీలక ఆధారాలు సురక్షితంగా ఉన్నాయా లేదా అగ్నికి ఆహుతయ్యాయా అన్న అంశంపై మూడు రోజులైనా అధికారిక స్పష్టత రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

అగ్ని ప్రమాదంపై పూర్తి స్థాయి నివేదిక వెలువడకపోవడం వల్ల సందేహాలు మరింత పెరుగుతున్నాయి. వేలాది కేసుల భవిష్యత్ దర్యాప్తు, కోర్టు విచారణపై ఈ ఘటన ప్రభావం ఎంతవరకు ఉంటుందో అధికారిక ప్రకటన వచ్చే వరకు స్పష్టత రానట్టే కనిపిస్తోంది.

ఫారెన్సిక్ ల్యాబ్‌లో నిల్వ ఉన్న కేసు ప్రాపర్టీలు, సీజ్ చేసిన ఎలక్ట్రానిక్ పరికరాలు, డీవీఆర్‌లు, వేలిముద్ర నమూనాలు, పాత కేసుల రికార్డులు సురక్షితంగా ఉన్నాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా పరిష్కారం కాని దొంగతనాల కేసులకు సంబంధించిన ఆధారాలు ధ్వంసమైతే దర్యాప్తు మందగించే ప్రమాదం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పోలీస్ ఉన్నతాధికారులు ముఖ్యమైన కేసుల ప్రాపర్టీలు సురక్షితంగా ఉన్నాయని, అగ్ని ప్రమాదం ప్రభావం పరిమితంగానే ఉందని చెబుతున్నప్పటికీ పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఫారెన్సిక్ నివేదికలు లేకుండా నిందితులపై అభియోగాలు నిరూపించడం కష్టతరం అవుతుందని న్యాయవాదులు చెబుతున్నారు. ముఖ్యంగా వేలిముద్రలు, డీఎన్‌ఏ, డిజిటల్ ఆధారాలు వంటి శాస్త్రీయ సాక్షాలు లేకపోతే కేసులు బలహీనపడే అవకాశం ఉంది. అయితే డిజిటల్ కాపీలు ఇప్పటికే ఉన్న కేసుల్లో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చని పోలీసులు చెబుతున్నారు.

2025లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 17 వేల దొంగతనాల కేసులు నమోదయ్యాయి. నగరాల్లో ఇళ్ల దొంగతనాలు, అపార్ట్‌మెంట్ బ్రేక్‌ఇన్‌లు ఎక్కువగా ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ద్విచక్ర వాహనాల చోరీలు అధికంగా నమోదయ్యాయి. చైన్ స్నాచింగ్ ఘటనలు కూడా గణనీయంగా పెరిగినట్లు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసుల్లో నిందితులను గుర్తించి శిక్షించేందుకు ఫారెన్సిక్ ఆధారాలు కీలకం.

ఇలాంటి సమయంలో ఫారెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం దర్యాప్తుపై ప్రభావం చూపుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే ఎందుకు తగలబడింది? చిన్న షార్ట్ సర్క్యూట్‌తో అంత పెద్ద నష్టం ఎలా జరిగింది? భద్రతా వ్యవస్థలు ఎందుకు పనిచేయలేదు? వంటి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

అంత కీలక ఆధారాలు నిల్వ చేసే సంస్థలో భద్రతా ప్రమాణాలు ఎలా విఫలమయ్యాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇంకా కోర్టుల్లో విచారణలో ఉన్న పాత కేసులకు సంబంధించిన ఆధారాల పరిస్థితిపై స్పష్టత రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఏదేమైనా పూర్తి స్థాయి విచారణ నివేదిక వెలువడిన తర్వాతే అసలు నష్టం ఎంత, దర్యాప్తుపై ప్రభావం ఎంత అన్నది స్పష్టమయ్యే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *