అధిక వడ్డీ మాయలో కోట్ల మోసం? గోకుల్నంద ఇన్ఫ్రా కేసులో కొత్త మలుపులు

గత నెల రోజులుగా తెలంగాణలో “గోకుల్నంద ఇన్ఫ్రా” పేరిట జరిగిన భారీ పెట్టుబడి మోసం కేసు పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది. రమావత్ మధు, మంగళి, ఆమె కుటుంబ సభ్యుల పేర్లు వరుసగా వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదమైంది. వేల కోట్ల రూపాయలు దండుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తుండగా, బాధితులు ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు నిర్వహించడం పరిస్థితిని మరింత తీవ్రమైంది.

ఈ కేసులో కొందరు మంగళిని సమర్థిస్తుండగా, మరికొందరు మాత్రం ఆమె కూడా మోసంలో భాగమని ఆరోపిస్తున్నారు. మరోవైపు అడ్వకేట్ సుబ్బు మంగళిపై కేసు నమోదు చేయడం కూడా ఈ వ్యవహారానికి కొత్త మలుపు తీసుకొచ్చింది.

ప్రాథమిక సమాచారం ప్రకారం, “గోకుల్నంద ఇన్ఫ్రా” అనే కంపెనీ అధిక వడ్డీ ఆశ చూపిస్తూ ప్రజల నుంచి పెట్టుబడులు సేకరించింది. ముఖ్యంగా రైతులు, కూలీలు, మధ్యతరగతి, బిలో మిడిల్ క్లాస్ ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఈ స్కీమ్ నడిపినట్లు తెలుస్తోంది. దేవరకొండ మండలం మల్లెపల్లి గ్రామాన్ని కేంద్రంగా చేసుకుని తాండాలలో ఈ వ్యవహారం విస్తరించినట్లు సమాచారం.

వీరు డైరెక్ట్‌గా ప్రజలతో సంబంధం పెట్టుకోకుండా, ప్రతి గ్రామంలో ఒక ప్రతినిధిని నియమించి చైన్ లింక్ విధానంలో పెట్టుబడులు సేకరించినట్లు తెలుస్తోంది. “ఇంకొకరిని తీసుకురా – మరొకరిని జాయిన్ చేయి” అనే మల్టీ లెవల్ మార్కెటింగ్ తరహాలో ఈ మోసం సాగినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొందరు లక్షల్లో, మరికొందరు కోట్లలో పెట్టుబడులు పెట్టగా, అప్పులు తెచ్చి పెట్టిన వారు కూడా ఉన్నారు.

ఇటీవల రమావత్ మధు సహాయకుడిగా చెప్పబడుతున్న వ్యక్తి మీడియా ముందుకు వచ్చి, ఈ మోసంలో మంగళి, ఆమె సోదరుడు శివ, రమావత్ మధు ముగ్గురూ కలిసి పనిచేశారని ఆరోపించడం సంచలనంగా మారింది. అయితే ఈ ఆరోపణలపై స్పష్టత కోసం పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేపట్టాల్సి ఉంది.

ఈ ఘటనలో అత్యంత బాధాకర అంశం బాధితుల పరిస్థితి. తమ కష్టార్జిత డబ్బును కోల్పోయిన వారు తీవ్ర ఆర్థిక, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. తాజాగా పాల్ది తాండాకు చెందిన రమేష్ అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందడం మరింత విషాదాన్ని మిగిల్చింది. తన ద్వారా పెట్టుబడి పెట్టిన వారంతా ఒత్తిడి తీసుకురావడంతో అతను తీవ్ర ఆందోళనకు గురైనట్లు సమాచారం.

ఈ కేసు విచారణలో ప్రధాన సవాలు “చైన్ లింక్” వ్యవస్థ. ఎవరి మీద కేసు పెట్టాలి? అసలు మాస్టర్‌మైండ్ ఎవరు? అనే విషయాల్లో స్పష్టత రావడానికి సమగ్ర దర్యాప్తు అవసరం. విచారణ పూర్తయి, నిందితులకు శిక్ష పడిన తర్వాతే బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉంది.

అయితే ఇలాంటి కేసుల్లో విచారణ ఆలస్యం కావడం సాధారణమే. ఈలోపు బాధితుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. అందుకే ప్రభుత్వం, పోలీసులు వేగంగా చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌లు వినిపిస్తున్నాయి.

ఇక ప్రజలు కూడా ఇలాంటి అధిక వడ్డీ ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. త్వరగా డబ్బు రెట్టింపు అవుతుందని చెప్పే స్కీమ్స్ వెనుక మోసాలు దాగి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా పరిశీలించడం అత్యంత కీలకం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *