అక్రమ సరోగసి రాకెట్ కేసు: డాక్టర్ నమ్రత అరెస్ట్… మనీ లాండరింగ్ కోణంలో ఈడి దర్యాప్తు

అక్రమ సరోగసి రాకెట్ మరియు మనీ లాండరింగ్ ఆరోపణల కేసులో డాక్టర్ అత్తులూరి నమ్రతను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) హైదరాబాద్ జోనల్ కార్యాలయం కీలక చర్యలు చేపట్టి, మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA-2002) కింద ఆమెను అదుపులోకి తీసుకుంది.

దర్యాప్తు ప్రకారం, యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ పేరిట అక్రమ సరోగసి కార్యకలాపాలు నిర్వహించినట్లు ఆరోపణలు వెలుగుచూశాయి. ఈ కేసుకు సంబంధించి నమోదైన ఎఫ్‌ఐఆర్ల ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో విచారణ ప్రారంభించిన అధికారులు, పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 2014 నుంచి ఈ కార్యకలాపాలు కొనసాగినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం.

మెడికల్ లైసెన్స్ సస్పెండ్ అయినప్పటికీ కార్యకలాపాలు కొనసాగించినట్లు కూడా ఈడి ఆరోపించింది. సంతానం లేని దంపతులకు చట్టబద్ధ సరోగసి పేరుతో భారీ మొత్తాలు వసూలు చేసి, పేద గర్భిణీ మహిళలను డబ్బుతో ప్రలోభ పెట్టి శిశువులను అప్పగించే ఒప్పందాలు చేసుకున్నట్లు దర్యాప్తులో బయటపడినట్లు అధికారులు తెలిపారు.

ఏజెంట్లు, సబ్ ఏజెంట్ల ద్వారా మహిళలను గుర్తించి ప్రసవాల అనంతరం శిశువులను అప్పగించే వ్యవస్థ ఏర్పాటుచేసినట్లు విచారణలో వెల్లడైంది. ఆడ శిశువులకు, మగ శిశువులకు వేర్వేరు మొత్తాలు వసూలు చేసినట్లు కూడా గుర్తించారు. జనన నమోదు సమయంలో అసలు తల్లిదండ్రుల వివరాల స్థానంలో ఇతరుల పేర్లు చేర్చి నకిలీ పత్రాలు సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అరెస్ట్ అనంతరం నమ్రతను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా, కోర్టు ఫిబ్రవరి 26 వరకు జుడిషియల్ కస్టడీ విధించింది. కేసులో మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతుందని ఈడి తెలిపింది.

ఈ ఘటన వెలుగులోకి రావడంతో అక్రమ సరోగసి కార్యకలాపాలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ మొదలైంది. ముఖ్యంగా ఫెర్టిలిటీ కేంద్రాల పనితీరు, చట్టబద్ధ సరోగసి విధానాల అమలు, పేద మహిళల రక్షణ వంటి అంశాలపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కేసు పురోగతిపై మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *