మంగ్లీపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో గిరిజన సంఘాలు మరోసారి స్పందించాయి. ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో నాయకులు మాట్లాడుతూ, ఈ వ్యవహారాన్ని విచారణ సంస్థలు పూర్తిగా పరిశీలించే వరకు ఎవరినీ నిందితులుగా ప్రకటించకూడదని పేర్కొన్నారు.
“మంగ్లీ మారుమూల తండా నుంచి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చింది. ఆమెపై ఆరోపణలు ఉంటే ఆధారాలతో నిరూపించాలి. లేకపోతే పదే పదే పేరు లాగడం సరైంది కాదు” అని శరత్ నాయక్ అన్నారు.
మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో ఇప్పటికే కేసులు నమోదయ్యాయని, ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రమావత్ మధును పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మిగతా వ్యక్తులపై కూడా విచారణ కొనసాగుతోందని చెప్పారు.
మంగ్లీతో సంబంధం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న అంశంపై మాట్లాడుతూ, “ఇప్పటివరకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు బయటకు రాలేదు. ఫోటోలు దిగడం మాత్రమే ఆధారంగా నేరారోపణలు చేయడం సరైంది కాదు” అని అన్నారు.
ఇంకా, ఈ వ్యవహారాన్ని కమ్యూనిటీతో అనుసంధానం చేయడం తగదని గిరిజన నాయకులు అభిప్రాయపడ్డారు. “ఇది ఒక వ్యాపార లావాదేవి అంశం మాత్రమే. దీనిని గిరిజన సమాజంతో కలపడం తప్పు” అని పేర్కొన్నారు.
బాధితులకు న్యాయం జరగాలని, దోషులు ఎవరైనా చట్టప్రకారం శిక్ష పొందాలని గిరిజన సంఘాలు స్పష్టం చేశాయి. విచారణ పూర్తయ్యే వరకు మీడియా, ఇతర వర్గాలు బాధ్యతగా వ్యవహరించాలని కోరాయి.

