ప్రసిద్ధ గాయని Mangli పై జరుగుతున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని గిరిజన సంఘాల నాయకులు స్పష్టం చేశారు. కొంతమంది కుట్రదారులు కావాలనే ఆమె ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని తీవ్రంగా ఖండించారు.
తెలంగాణ గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుబ్బు నాయక్ మాట్లాడుతూ, గత కొద్ది రోజులుగా మంగ్లీపై అనేక అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ వ్యవహారం ఇప్పటికే దర్యాప్తు సంస్థల వద్ద ఉన్నప్పటికీ, కొన్ని వర్గాలు వ్యక్తిగత లాభాల కోసం ఆమెను నిందితురాలిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు.
బాధితులతో మాట్లాడినప్పుడు వారు కూడా మంగ్లీకి ఈ వ్యవహారంలో సంబంధం లేదని ఒప్పుకున్నారని తెలిపారు. “మాకు ఇంతకాలం ఎవరూ అండగా నిలవలేదు. ఇప్పుడు మంగ్లీ పేరు రావడంతో కొంత న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం” అని బాధితులు పేర్కొన్నట్లు తెలిపారు.
మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో అధిక వడ్డీ ఆశతో పెట్టుబడులు పెట్టినవారు కూడా బాధ్యత వహించాల్సిందేనని, ఇది కేవలం ఒకరి మీద నిందలు వేయడం సరైంది కాదని నాయకులు అభిప్రాయపడ్డారు. “ఎవరైనా అధిక వడ్డీకి డబ్బులు ఇస్తే అది కూడా నేరమే. అందుకే ఈ వ్యవహారాన్ని మానవతా దృక్పథంతో పరిశీలించాలి” అని అన్నారు.
కొంతమంది మీడియా సంస్థలు మరియు వ్యక్తులు ఎలాంటి ఆధారాలు లేకుండా మంగ్లీపై కోట్లు రూపాయల స్కామ్ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక సెలబ్రిటీగా ఇతరులతో ఫోటోలు దిగడం ఆధారంగా నేరారోపణలు చేయడం తగదని పేర్కొన్నారు.
ఇంకా, ఈ కేసులో వాస్తవాలు ఉంటే అవి దర్యాప్తు సంస్థలకు సమర్పించాలని, మీడియా ట్రయల్ చేయకుండా నిజాలు బయటకు రావడానికి సహకరించాలని కోరారు. “దోషులు ఎవరైనా చట్టం ప్రకారం శిక్షించాలి. కానీ ఆధారాలు లేకుండా ఒక గిరిజన బిడ్డను బద్నాం చేయడం అన్యాయం” అని స్పష్టం చేశారు.
గిరిజన సమాజ గౌరవాన్ని కాపాడేందుకు తాము పోరాటం కొనసాగిస్తామని, ఇకపై మంగ్లీపై తప్పుడు ఆరోపణలు చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.

