పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తాజాగా ఇంధన ధరల పెంపు మరింత భారంగా మారింది. రాష్ట్రంలో పెట్రోల్ ధర లీటరుకు రూ.110 దాటగా, డీజిల్ ధర కూడా భారీగా పెరగడం వల్ల వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వాలు పెట్రోల్ వినియోగాన్ని తగ్గించాలని, ఖర్చులను నియంత్రించాలని సూచిస్తున్నప్పటికీ, తక్కువ జీతాలతో జీవించే కుటుంబాలు ఎలా బతకాలనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నెలకు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు జీతం వచ్చే ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, కార్మికులు పెరుగుతున్న ఖర్చులను తట్టుకోలేకపోతున్నారు.
పెట్రోల్ ధరలు పెరగడం వల్ల కేవలం వాహనాల ఖర్చే కాదు, రవాణా వ్యయం పెరగడంతో కూరగాయలు, నిత్యావసర సరుకులు, ఆన్‌లైన్ డెలివరీలు, గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా పెరిగే పరిస్థితి ఏర్పడుతోంది. రాష్ట్రంలో వాహనదారులపై నెలకు రూ.117 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఆర్టీసిపై కూడా ప్రతి నెల కోట్ల రూపాయల అదనపు ఖర్చు పడనుంది.
ప్రజలు చెల్లించే టాక్సులతో ప్రభుత్వ వ్యవస్థ నడుస్తున్నప్పటికీ, అదే ప్రజలపై మళ్లీ మళ్లీ భారం మోపడం సరైన విధానమా అనే చర్చ మొదలైంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం బాధ్యతలు మోపుకుంటున్న సమయంలో ప్రజలు మాత్రం తమ సమస్యలకు స్పష్టమైన సమాధానం కోరుతున్నారు.
ఇంధన ధరల పెంపు వెనుక అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, పన్నుల విధానం, ప్రభుత్వ ఆర్థిక భారం వంటి కారణాలు చెబుతున్నా, సామాన్యుడి జీవితం మాత్రం రోజు రోజుకూ కష్టంగా మారుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

