పోక్సో చట్టంపై అవగాహన పెరగాలి.. అబ్బాయిల పెంపకంలో మార్పు రావాలా?

మైనర్ల రక్షణ కోసం తీసుకొచ్చిన పోక్సో చట్టం ఇప్పుడు సమాజంలో అత్యంత కీలకమైన చట్టాల్లో ఒకటిగా మారింది. 18 ఏళ్ల లోపు పిల్లలపై జరిగే లైంగిక దాడులు, వేధింపులు, చైల్డ్ పోర్నోగ్రఫీ వంటి నేరాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఈ చట్టం అమల్లో ఉంది. తెలంగాణలో ప్రతి ఏడాది వేల సంఖ్యలో పోక్సో కేసులు నమోదవుతుండగా, అందులో చాలా కేసుల్లో నిందితులు బాధితులకు తెలిసిన వారే కావడం ఆందోళన కలిగించే విషయం.

ప్రస్తుతం సమాజంలో “గుడ్ టచ్ – బ్యాడ్ టచ్” పై అవగాహన పెరుగుతోంది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు తెలియని వ్యక్తుల దగ్గరకు వెళ్లొద్దు, ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే వెంటనే చెప్పాలని సూచిస్తున్నారు. ఇది మంచి మార్పే అయినా ఇంకా సమాజంలో పెద్ద మార్పు రావాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఎందుకంటే ఇప్పటికీ చాలా సందర్భాల్లో అమ్మాయిలకే జాగ్రత్తలు చెప్పే పరిస్థితి కనిపిస్తోంది. “అక్కడికి వెళ్లొద్దు”, “ఇలా డ్రెస్సులు వేసుకో”, “ఈ టైంలో బయటికి వెళ్లొద్దు” అంటూ ఎక్కువగా అమ్మాయిలకే పరిమితులు పెడుతున్నారు. కానీ అసలు మార్పు రావాల్సింది అబ్బాయిల పెంపకంలోనూ అనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

అబ్బాయిలకు కూడా చిన్న వయసు నుంచే మహిళలను గౌరవించడం, హద్దులు దాటకూడదని, ఇతరుల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని కచ్చితంగా నేర్పించాల్సిన అవసరం ఉందని సామాజిక వేత్తలు చెబుతున్నారు. కేవలం అమ్మాయిలకు మాత్రమే కౌన్సిలింగ్ ఇవ్వడం సరిపోదని, అబ్బాయిల ప్రవర్తనపై కూడా తల్లిదండ్రులు పర్యవేక్షణ చేయాలని సూచిస్తున్నారు.

ప్రస్తుతం పిల్లల చేతిలో మొబైల్ ఫోన్లు చిన్న వయసులోనే పడుతున్నాయి. ఫోన్ ద్వారా పిల్లలు ఏం చూస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఎలాంటి కంటెంట్ ప్రభావం పడుతోంది? అనే అంశాలపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాల్సిన అవసరం పెరిగింది. సోషల్ మీడియా, ఇంటర్నెట్, ఆన్‌లైన్ కంటెంట్ పిల్లల ఆలోచనలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చదువుకున్నవారు, ఉన్నత స్థాయిలో ఉన్నవారు కూడా ఆన్‌లైన్ ట్రాప్స్ బారిన పడుతున్న ఈ కాలంలో చిన్నపిల్లల విషయంలో మరింత జాగ్రత్త అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పోక్సో కేసుల్లో శిక్షలు కఠినంగా ఉండటంతో పాటు అవగాహన కూడా అంతే ముఖ్యమని పోలీసులు చెబుతున్నారు. పాఠశాల స్థాయి నుంచే గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, పోలీస్ హెల్ప్ నంబర్లు 100 లేదా 112 ద్వారా సహాయం పొందవచ్చని అధికారులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నిమ్స్ ఆసుపత్రిలో మెడికల్ మాఫియా నడుస్తోందనే ఆరోపణలు కూడా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. కొంతమంది డాక్టర్లు రోగులను నిర్దిష్ట మెడికల్ షాపులకే పంపిస్తూ కమిషన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. “ఈ మందులు ఆసుపత్రిలో దొరకవు”, “బయట ఈ షాపులో మాత్రమే లభిస్తాయి” అంటూ రోగులను ప్రత్యేక షాపులకు పంపుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

రోగుల పరిస్థితిని ఆసరాగా చేసుకొని మందుల పేరుతో అధిక ధరలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తక్కువ ధరలకు బయట దొరికే మందులను ప్రత్యేక షాపుల్లో ఎక్కువ ధరలకు కొనాల్సిన పరిస్థితి వస్తోందని పలువురు బాధితులు చెబుతున్నారు. కొంతమంది డాక్టర్లు – మెడికల్ షాపుల మధ్య కమిషన్ వ్యవస్థ నడుస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఆరోపణలపై నిమ్స్ యాజమాన్యం, వైద్య ఆరోగ్యశాఖ పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే సాధారణ ప్రజలు ఎవరిని నమ్మాలని ప్రశ్నిస్తున్నారు. వైద్యాన్ని సేవగా కాకుండా వ్యాపారంగా మార్చే ఇటువంటి వ్యవస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక వర్గాలు కోరుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *