నమస్తే.. వెల్కమ్ టు ఓకే టీవీ. హైదరాబాద్ అమీర్‌పేట్‌లో జరిగిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం రాజకీయ వేడిని మరింత పెంచింది. సభా ప్రాంగణం మొత్తం కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలు, పాటలు, జెండాలతో సందడిగా మారింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశంసిస్తూ వినిపించిన పాటలు సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
“మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు.. కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న” అంటూ కార్యకర్తలు ఉత్సాహంగా పాటలు పాడారు. “నిగ్గదీసి అడిగే మొనగాడు”, “అహమంటూ లేనివాడు”, “అందరినీ కలిపేటోడు” అంటూ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కొనియాడారు. తెలంగాణ ప్రజల ఆశలు తీర్చే నాయకుడు రేవంత్ అంటూ సభలో నినాదాలు మార్మోగాయి.
ఇందిరమ్మ రాజ్యం మళ్లీ తీసుకొచ్చేది రేవంత్ రెడ్డే అని పాటల్లో పేర్కొన్నారు. తెలంగాణ కోసం పోరాడే పులిబిడ్డగా, పేదల కోసం నిలబడే నాయకుడిగా ఆయనను కాంగ్రెస్ శ్రేణులు అభివర్ణించాయి. “దొంగ దొరల భరతం పడతాడు”, “పేద ఇంటింటికి పండుగ తెస్తాడు” వంటి పదాలతో రాజకీయ సందేశాలు కూడా ఇచ్చారు.
ఇక సభలో ఎన్టీఆర్ వారసత్వాన్ని ఘనంగా స్మరించారు. తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీకగా, తెలుగు జాతి కీర్తి పతాకంగా స్వర్గీయ నందమూరి తారకరామారావును కొనియాడారు. ఆయన కేవలం సినీ రంగానికే కాదు.. సామాన్య ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత అని వక్తలు పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వర్ణహస్తాలతో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రజలకు అంకితం చేయడం సభలో ప్రధాన ఘట్టంగా నిలిచింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సీఎం, మంత్రులు, అతిథులకు స్వాగతం పలికారు. వేదికపై ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
“ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం” అన్న ఎన్టీఆర్ సిద్ధాంతాలను గుర్తు చేస్తూ వక్తలు ప్రసంగించారు. ఒకసారి కలిస్తే మళ్లీ కలవాలనిపించే వ్యక్తిత్వం, ఒక పని చేస్తే చరిత్రలో నిలిచిపోయేలా చేసే నాయకత్వం ఎన్టీఆర్ సొంతమని అన్నారు.
మొత్తంగా ఈ కార్యక్రమం కాంగ్రెస్ రాజకీయ శక్తి ప్రదర్శనగా మారగా.. ఎన్టీఆర్ పేరు చుట్టూ తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చ మొదలైంది.

