నమస్తే.. వెల్కమ్ టు ఓకే టీవీ. హైదరాబాద్ అమీర్‌పేట్‌లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. సభా ప్రాంగణం మొత్తం కాంగ్రెస్ జెండాలు, నినాదాలు, పాటలతో మార్మోగిపోయింది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని పొగిడే పాటలు సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
“మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న” అంటూ వినిపించిన పాటలు కాంగ్రెస్ కార్యకర్తల్లో భారీ ఉత్సాహాన్ని నింపాయి. తెలంగాణ కోసం పోరాడే నాయకుడిగా, పేదల కోసం నిలబడే నేతగా రేవంత్ రెడ్డిని పాటల ద్వారా చిత్రీకరించారు.
సభలో రేవంత్ రెడ్డి పై “నిగ్గదీసి అడిగే మొనగాడు”, “బీదసాదల ధైర్యం”, “దొంగ దొరల భరతం పడతాడు” వంటి పదాలతో ప్రశంసలు కురిశాయి. ఇందిరమ్మ రాజ్యం మళ్లీ తీసుకొచ్చే నాయకుడు రేవంత్ అంటూ కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు.
ఇక కార్యక్రమంలో ఎన్టీఆర్ వారసత్వాన్ని కూడా ఘనంగా కొనియాడారు. తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీకగా, తెలుగు జాతి కీర్తి పతాకంగా స్వర్గీయ నందమూరి తారకరామారావును అభివర్ణించారు. ఆయన కేవలం సినీ రంగానికే కాకుండా సామాన్య ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత అని వక్తలు పేర్కొన్నారు.
వేదికపై ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథులకు స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వర్ణహస్తాలతో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రజలకు అంకితం చేయడం సభలో ప్రధాన ఘట్టంగా నిలిచింది.
ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం అన్న ఎన్టీఆర్ సిద్ధాంతాలను గుర్తు చేస్తూ వక్తలు ప్రసంగించారు. ఒక పని చేస్తే అది చరిత్రలో నిలిచిపోయేలా చేయాలని చెప్పిన ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని పలువురు కొనియాడారు.
ఇక సభలో కాంగ్రెస్, టిడిపి భావోద్వేగాల మేళవింపు కనిపించగా.. రాజకీయంగా ఇది కొత్త చర్చకు దారితీసింది. తెలంగాణ రాజకీయాల్లో ఎన్టీఆర్ పేరు మరోసారి కేంద్రబిందువుగా మారింది.

