తెలంగాణ ఆత్మగౌరవం, సామాజిక న్యాయమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సహకరించిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో మాట్లాడిన సీఎం, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ అభివృద్ధి, పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయం లక్ష్యాల సాధనకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని పాలనగా కాకుండా సేవా బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు.

రైతులు, యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అగ్రవర్ణ పేదల అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తూనే ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సామాజిక న్యాయాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

తెలంగాణ ఉద్యమం కేవలం అభివృద్ధి కోసం మాత్రమే కాకుండా ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సమాన హక్కుల కోసం జరిగిన పోరాటమని గుర్తు చేశారు. రాచరిక, నియంతృత్వ ధోరణులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఎప్పటికప్పుడు పోరాడిన చరిత్రను స్మరించారు.

“తెలంగాణ రైజింగ్–2047” విజన్ డాక్యుమెంట్ ద్వారా వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమలు, ఉపాధి రంగాల్లో సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని తెలిపారు. రైతులను కేవలం పంటల ఉత్పత్తిదారులుగానే కాకుండా వ్యవసాయ ఆధారిత పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

2025-26 అంచనాల ప్రకారం తెలంగాణలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 2.36 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరిందని సీఎం వెల్లడించారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో వరి, మొక్కజొన్న, పత్తి పంటల సాగు విస్తీర్ణం పెరిగిందని చెప్పారు. పశుసంపద, మత్స్య రంగాలు కూడా గణనీయమైన పురోగతి సాధించాయని వివరించారు.

రైతులు విభిన్న పంటల సాగుపై దృష్టి పెట్టి తెలంగాణను సకల పంటల నిలయంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చిన సీఎం, వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సంపద సృష్టించడమే ప్రభుత్వ ప్రధాన సంకల్పమని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *