షామీర్పేట పెద్దమ్మ కాలనీలో నివసిస్తున్న పేద ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. జీవనోపాధి కోసం కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్న ఈ కుటుంబాలు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒక ఒంటరి మహిళ మాట్లాడుతూ –
“మాకు తినడానికి గతి లేదు మేడం. పిల్లల్ని ఏం చదివించాలి? రెండు బుక్కులు ఇస్తారు కానీ తినడానికి కూడా లేదు. నెలకు 4000 కిరాయి కట్టి ఎట్లా బతకాలి? నా భర్త చనిపోయి ఆరు సంవత్సరాలు అయ్యింది. ఒంటరి మహిళా పించన్ 2000 మాత్రమే వస్తుంది. రేవంత్ ప్రభుత్వం ఇచ్చిందేమీ లేదు. పాత ప్రభుత్వం ఇచ్చింది – కానీ కొత్త ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇయ్యలేదమ్మా” అని కన్నీళ్లు పెట్టుకున్నారు.
అదే కాలనీలో మరో మహిళ మాట్లాడుతూ,
“మాకు నీళ్లు లేవు, లైట్లు లేవు, కరెంట్ లేదు. పెద్దమ్మ కాలనీలో 20 నిమిషాల నీళ్లు ఇస్తారు. మిగతా సమయం పాములు తిరుగుతున్నాయి, పిల్లలకు ప్రమాదం. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లేవు. ఇస్తామంటారు కానీ ఇచ్చిన వాళ్లకే మళ్లీ ఇస్తున్నారు. లేని వాళ్లకి మాత్రం ఏమీ రావట్లేదు,” అని వాపోయింది.
స్థానికులు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ,
“ఓట్లు అడిగేటప్పుడు వస్తారు, తర్వాత ఐదు సంవత్సరాలు ముఖం కూడా చూపరు. రేవంత్ అన్నా నువ్వు ఎక్కడున్నావ్? లేని వాళ్లకి ఇళ్లు ఇవ్వు, ఉన్న వాళ్లకి రెండో ఇళ్లు వద్దు. ఇక్కడ నీళ్లు లేవు, కరెంట్ లేదు, పాములు తిరుగుతున్నాయి. ఇది ఏ ప్రజాపాలన?” అని ప్రశ్నించారు.
గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బంది కూడా తమ జీతాలు ఆరు నెలలుగా రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. “మేము వాచ్మెన్లు, సోషల్ హెల్పర్లు. ఆరు నెలలుగా జీతం లేదు. ఒక వ్యక్తి ఆర్థిక కష్టాల వల్ల రైలు కింద పడి చనిపోయాడు. ఇది న్యాయమా?” అని ప్రశ్నించారు.
స్థానికులు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, “మాకు ఇళ్లు, నీళ్లు, లైట్లు, పించన్ ఇవ్వండి. లేని వాళ్లకి ఇల్లు ఇవ్వండి, ఉన్న వాళ్లకి మళ్లీ ఇవ్వకండి. పేదల మీద కనికరంతో వ్యవహరించండి,” అని వేడుకుంటున్నారు.
ఈ పరిస్థితులు ప్రజాపాలనలో లోపాలను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆరు గ్యారెంటీలు, ఉచిత బస్, ఉచిత విద్యుత్ అని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం – పేదల బతుకుల్లో మాత్రం ఇంకా వెలుగులు రానీయలేదని షామీర్పేట ప్రజల వేదన చెబుతోంది.

