తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. అన్నాడీఎంకేలో చీలిక? విజయ్ టీవీకేకు మద్దతుపై హైడ్రామా

టీవీకేకు మద్దతుపై అన్నాడీఎంకేలో విభేదాలు.. 30 మంది ఎమ్మెల్యేలు సిద్ధమా?

తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం అత్యంత రసవత్తరంగా మారాయి. సూపర్ స్టార్ విజయ్ స్థాపించిన తమిళగా వెట్రి కళగం (టీవీకే) పార్టీ చుట్టూ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన సీట్లు సాధించినప్పటికీ పూర్తి మెజారిటీకి కొద్ది దూరంలో ఆగిపోయిన టీవీకేకు మద్దతు ఇవ్వాలా వద్దా అనే అంశంపై అన్నాడీఎంకేలో తీవ్ర చర్చ జరుగుతోంది.

సమాచారం ప్రకారం, అన్నాడీఎంకేకు చెందిన దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చి ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంలో మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామికి అత్యంత సన్నిహితుడైన మాజీ మంత్రి సీవీ షణ్ముగం కీలక పాత్ర పోషిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ప్రారంభంలో టీవీకేకు మద్దతు ఇవ్వడానికి పళనిస్వామి ఆసక్తి చూపలేదని సమాచారం. అయితే పార్టీలోని కీలక నేతలు ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగం వంటి వారు విజయ్‌తో కలిసి వెళ్లడం రాజకీయంగా మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక బీజేపీ నాయకత్వం కూడా ఈ పరిణామాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ మద్దతుతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు కాకుండా ఉండేందుకు అన్నాడీఎంకే ద్వారా టీవీకేకు మద్దతు వచ్చేలా బీజేపీ పావులు కదుపుతోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

టీవీకేకు మద్దతు ఇస్తే క్యాబినెట్‌లో కీలక పదవులు కూడా దక్కించుకోవచ్చనే ఆలోచనలో కొందరు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్ రాజకీయాలకు కొత్త కావడంతో అనుభవజ్ఞులైన తమ పార్టీ నేతలు ప్రభుత్వంలో ఉంటే పరిపాలన సజావుగా సాగుతుందని వారు భావిస్తున్నారట.

అయితే ఇదే అంశంపై అన్నాడీఎంకేలో మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. టీవీకేతో పొత్తు పార్టీకి నష్టం చేస్తుందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఒకవేళ పళనిస్వామి టీవీకేతో కలిసేందుకు అంగీకరించకపోతే పార్టీ చీలిపోయే ప్రమాదం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక మరోవైపు డీఎంకే-అన్నాడీఎంకే పొత్తుపై కూడా ప్రచారం జరుగుతోంది. దశాబ్దాలుగా బద్ధ శత్రువులుగా ఉన్న ఈ రెండు పార్టీలు విజయ్ ప్రభంజనాన్ని అడ్డుకోవడానికి చేతులు కలిపే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. తమిళనాడు రాజకీయ చరిత్రలో ఇదొక అరుదైన పరిణామంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే 59 స్థానాలు, అన్నాడీఎంకే 47 స్థానాలు గెలుచుకున్నాయి. ఈ రెండు పార్టీలు కలిపి 106 స్థానాల వద్ద నిలిచాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118కు ఇంకా 12 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.

“ప్రజాస్వామ్యానికి మేలు చేసే వార్త త్వరలో వింటారు” అంటూ డీఎంకే నేత హవిజుల్లా చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో మరింత చర్చకు దారితీసింది.

అన్నాడీఎంకే నేత కోవై సత్యన్ మాట్లాడుతూ, “బంతి ఇప్పుడు విజయ్ కోర్టులో ఉంది. రెండు పార్టీల మధ్య సానుకూల వాతావరణం ఉంది. తుది నిర్ణయం పార్టీ హైకమాండ్ తీసుకుంటుంది” అని వ్యాఖ్యానించారు. అలాగే పార్టీ చీలిక వార్తలను ఆయన ఖండించారు.

ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో విజయ్ పార్టీ కీలక శక్తిగా మారిన నేపథ్యంలో, టీవీకేకు మద్దతు ఎవరు ఇస్తారు? ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *