అలుగునూరు చౌరస్తాలో హైకోర్టు న్యాయవాదిపై దాడి యత్నం.. లా అండ్ ఆర్డర్‌పై ప్రశ్నలు

యూపీ నంబర్ ఫార్చ్యూనర్‌లో వచ్చిన దుండగులు.. లా అండ్ ఆర్డర్‌పై తీవ్ర విమర్శలు

కరీంనగర్ జిల్లా అలుగునూరు చౌరస్తాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ప్రముఖ న్యాయవాది ఖాళీద్‌పై దుండగులు దాడి చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనలో యూపీ రిజిస్ట్రేషన్ ఉన్న ఫార్చ్యూనర్ వాహనం ఉపయోగించారని చెబుతుండటంతో పోలీసులు, లా అండ్ ఆర్డర్ వ్యవస్థపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సమాచారం ప్రకారం, ఈ నెల 5వ తేదీన సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య అలుగునూరు చౌరస్తా వద్ద న్యాయవాది ఖాళీద్‌ను నలుగురు వ్యక్తులు అడ్డగించి బెదిరించినట్లు తెలుస్తోంది. యూపీ 16 బీసీ 2900 నంబర్ గల ఫార్చ్యూనర్ వాహనంలో వచ్చిన ఆ వ్యక్తులు ఆయుధాలతో బెదిరించారని న్యాయవాది ఆరోపించారు.

ఈ ఘటన అనంతరం బాధిత న్యాయవాది పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదులో “వెపన్స్” అనే పదాన్ని ఉపయోగించవద్దని పోలీసులు ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు మరింత వివాదాస్పదంగా మారాయి. “వెపన్స్‌తో బెదిరించారు” అని రాస్తే ఫిర్యాదు స్వీకరించబోమని పోలీసులే ఒత్తిడి తీసుకొచ్చారని న్యాయవాది వర్గాలు చెబుతున్నాయి.

పోలీస్ యాప్ ద్వారా వాహన వివరాలు పరిశీలించగా, ఆ ఫార్చ్యూనర్ ఉత్తరప్రదేశ్‌కు చెందినదిగా గుర్తించినట్లు సమాచారం. దీంతో ఈ ఘటన వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? ఎందుకు వచ్చారు? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తన ఫిర్యాదును సరిగా నమోదు చేయలేదని ఆరోపిస్తూ న్యాయవాది ఖాళీద్ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. పోలీసుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిసింది. ఒక హైకోర్టు న్యాయవాదికే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

ఈ ఘటనతో కరీంనగర్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ పరిస్థితిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బహిరంగ ప్రదేశంలో, చౌరస్తా వద్దే దుండగులు ఆయుధాలతో బెదిరించారనే ఆరోపణలు రావడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిజానిజాలు బయటపెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *